విజ‌య‌సాయికి అమిత్‌షా షాక్‌.. జ‌గ‌నన్నకు మైండ్ బ్లాంక్‌..

వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ అమితానందాన్ని ప్ర‌ద‌ర్శించారు. హ‌స్తిన వ‌చ్చిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదంటూ చంక‌లుగుద్దుకున్నారు. అయితే, విజ‌యసాయి ఆనందం ఎంతోసేపు నిల‌వ‌లేదు. ఆయ‌న ప్రెస్‌మీట్ ముగిసిందో లేదో.. స్వ‌యంగా హోంమంత్రి అమిత్‌షానే చంద్ర‌బాబుకు ఫోన్ చేయ‌డంతో విజ‌యసాయికి దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయి ఉంటుంది. చంద్ర‌బాబు వెళ్లి అమిత్‌షాను క‌లిసుంటే కాస్త రొటీన్‌గా ఉండి ఉండేది.. అదే అమిత్‌షానే సీబీఎన్‌కు ఫోన్ చేసి మాట్లాడ‌టం సంథింగ్ స్పెష‌ల్ అంటున్నారు. ఈ ప‌రిణామం ఇటు వైసీపీకి అటు విజ‌య‌సాయికి అస‌లేమాత్రం రుచించి ఉండ‌క‌పోవ‌చ్చు గానీ.. ద‌టీజ్ సీబీఎన్ అంటూ సోష‌ల్ మీడియాలో తెలుగు త‌మ్ముళ్లు తెగ రెచ్చిపోతున్నారు. ఆ పోస్టులు చూసి విజ‌య‌సాయికి ముఖం మాడిపోయి ఉంటుందంటున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోరినప్పుడు తాను కశ్మీర్‌ పర్యటన, వివిధ‌ కార్యక్రమాల వ‌ల్ల సమయం ఇవ్వలేకపోయాన‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం, టీడీపీ ఆఫీసుల‌పై దాడులు, డ్ర‌గ్స్‌, గంజాయి దందాలు, పోలీసుల తీరుపై చంద్రబాబు అమిత్‌షాకు వివరించారు. 

మామూలుగా చూస్తే.. అపాయింట్‌మెంట్ ఇవ్వ‌నంత మాత్రాన అమిత్‌షా అంత‌టి వాడు చంద్ర‌బాబుకు తిరిగి ఫోన్ చేయాల్సిన అవ‌స‌రం లేదు.. కానీ, చేశారంటే ఏంటి అర్థం? గ‌తంలో సీఎం జ‌గ‌న్‌కు సైతం అమిత్‌షా ప‌లుమార్లు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌నెప్పుడూ తిరిగి ఫోన్ చేసింది లేదు. చంద్ర‌బాబు విష‌యంలో మాత్ర‌మే ఆయ‌నిలా ఫోన్ చేశారంటే.. టీడీపీ విష‌యంలో కేంద్రం-బీజేపీ వైఖ‌రి మారుతోంద‌నేగా..? అంటున్నారు. 

వైసీపీపై కేంద్రానికి ఇంట్రెస్ట్ త‌గ్గిపోయింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌వ‌రించిన అంచ‌నాల నిధులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఇక ఏపీలో జ‌రుగుతున్న మ‌త మార్పిడిలు, ఆల‌యాల ధ్వంసంపై ఆర్ఎస్ఎస్ ప‌త్రిక‌లో ఘాటైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా చేస్తున్న అప్పుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూ వ‌స్తోంది కేంద్రం. ఇలా వైసీపీ విష‌యంలో కేంద్రం వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌స్తున్న సంద‌ర్భంలో.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు అమిత్‌షా స్వ‌యంగా ఫోన్ చేసి.. పార్టీ కార్యాల‌యాల‌పై దాడుల గురించి తెలుసుకోవ‌డం రాజకీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఒక్క ఫోన్ కాల్‌.. భ‌విష్య‌త్తులో జ‌రిగే అవ‌కాశ‌మున్న‌ రాజ‌కీయ మార్పుల‌కు నాంది అంటున్నారు. ఈ ప‌రిణామం జ‌గ‌న‌న్న‌కు అస‌లే మాత్రం న‌చ్చ‌క‌పోవ‌చ్చు.