ఈటలకు ఓటేయాలన్న హరీష్.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్..

హుజురాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్రచారం తారాస్థాయిలో జరిగింది. ప్రచార గడువు ముగిసే చివరి నిమిషం వరకు ఓటర్ల ప్రసన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు  నేతలు. అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం అంతా తానే శ్రమించారు మంత్రి హరీష్ రావు. దాదాపు రెండు నెలలుగా ఆయన నియోజకవర్గంలోనే తిరిగారు. గతంలో ఈటల రాజేందర్ కు ఆప్త మిత్రుడిగా ఉన్న హరీష్ రావు.. ఆయనను ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ సాగింది. ఈటలకు వ్యతిరేకంగా హరీష్ రావు ప్రచారం చేస్తున్నా.. ఆయన మనసంతా రాజేందర్ వైపే ఉందనే వాదన కూడా వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అక్కడ తిరుగుతున్నారు కాని.. ఈటలను ఓడించేంత కసిగా ప్రచారం చేయడం లేదనే వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వచ్చింది.

ఈటల రాజేందర్ కూడా తన ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు కాని హరీష్ రావుపై ఎక్కడ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు హరీష్ రావు చాలా మంచోడని, కేసీఆర్ అతన్నిబలి పశువు చేస్తున్నారని కూడా కామెంట్ చేశారు. హరీష్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈటల చెప్పినట్లే హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ దూరంగా ఉండటం జనాల్లోనూ చర్చకు దారి తీసింది. ఓడిపోతామని తెలుసు కాబట్టే తండ్రి కొడుకులు ప్రచారాని రాలేదని, ఓటమిని హరీష్ రావుపై నెట్టేసి అతన్ని వీక్ చేసే కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరిగింది.

ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచనంగా మారాయి. అధికార పార్టీని షేక్ చేస్తోంది. హుజురాబాద్ రోడ్ షోలో మాట్లాడిన హరీష్ రావు... డమ్మీఈవీఎమ్ ను ఓటర్లకు చూపిస్తూ ఒకటో నెంబర్ పై బటన్ నొక్కాలని చెప్పారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఈవీఎమ్ లో ఒకటో నెంబర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ది. అంటే ఒకటో నెంబర్ పై ఓటు వేయమనడం ద్వారా హరీష్ రావు.. ఈటల రాజేందర్ కు ఓటేయమని చెప్పినట్లైంది. హరీష్ రావు వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మొదటి నుంచి హరీష్ రావు మనసంతా ఈటల రాజేందర్ పైనే ఉందని, చివరి రోజు అలా బయటికి వచ్చేసిందనే చర్చ జనాల్లో సాగుతోంది. 

మరోవైపు అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటేయాలని హరీష్ రావు క్లియర్ గా చెప్పారని, అయితే ఈవీఎమ్ ను చూపిస్తున్నప్పుడు పొరపాటున చేయి ఒకటో నెంబర్ పైకి వెళ్లిందని చెప్పారు. పొరపాటున జరిగిన ఘటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ చిల్లర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఒకటో నెంబర్ బటన్ నొక్కాలంటూ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన మాత్రం ఇప్పుడు హుజురాబాద్ లో వైరల్ గా మారింది. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.