భూమి పూజ చేసినా దీక్షకి ఈ ఆటంకాలు ఏమిటి?
posted on Sep 23, 2015 7:44PM
.jpg)
ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26నుండి గుంటూరులో ఏసి కాలేజీకి ఎదురుగా ఉన్న మైదానంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేయబోయే నిరాహార దీక్షకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైకాపా నేతలు కంగు తిన్నారు.
ప్రత్యేక హోదా కోరుతూ గత నెలాఖరున వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహించింది. కానీ దానికి మిశ్రమ స్పందన రావడంతో ఈదీక్షను ఎలాగయినా విజయవంతం చేయాలనే పట్టుదలతో వైకాపా నేతలు చాలా పట్టుదలగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్ష చేయబోయే ప్రదేశంలో వైకాపా నేతలు భూమి పూజ కూడా చేసారు. ఈ దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాలని జగన్ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా ఆయన కూడా విద్యార్ధులతో సమావేశం అవుతూ వారిని కూడా తన పోరాటంలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసారు.
కానీ ఊహించని విధంగా ఆయన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చాలా కంగారు పడుతున్నారు. తాము దీక్షకి అనుమతి కోరుతూ 20వ తేదీనే పోలీసులకు దరఖాస్తు చేసుకొన్నాకమే పనులు మొదలుపెట్టమని ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని ఇటువంటి సమయంలో ట్రాఫిక్ సమస్య పేరిట తమ దీక్షకు అనుమతి నిరాకరించడం సరికాదని ఆ పార్టీ నేత తలశిల రఘురాం అన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తమ పార్టీ అన్ని విధాల పోలీసులకి సహకరిస్తుందని, కనుక తమ దీక్షకు అనుమతి మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. జగన్ దీక్ష విజయవంతం అవుతుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా కుట్ర పన్నిందని అయన ఆరోపించారు. ఒకవేళ తమ అధినేతను దీక్షకు అనుమతించకపోతే ఆయన రోడ్డు మీదే దీక్షకు కూర్చొంటారని రఘురాం హెచ్చరించారు.
సాధారణంగా రాజకీయ పార్టీలు ఇటువంటి దీక్షలు చేసే ముందు స్థానిక పోలీసుల అనుమతి తీసుకొని వారి అనుమతించిన సమయం వరకే దీక్ష చేసుకోవచ్చును. జగన్మోహన్ రెడ్డి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకి కూర్చొన్నప్పుడు డిల్లీ పోలీసులు ఆయనకీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే అనుమతించడంతో జగన్ సరిగ్గా అదే సమయానికి తన దీక్షని ముగించాల్సి వచ్చింది. ఏ రాష్ట్రంలోనయినా ఏ రాజకీయ పార్టీకయినా అదే నియమం వర్తిస్తుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవాలనుకొన్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకి తెలియజేసి వారు అనుమతిస్తేనే దీక్షకి కూర్చోగలరు. కానీ పోలీసులకి తెలియజేసి వారు అనుమతిస్తారులే..అని భావించి ఏర్పాట్లు చేసుకొంటే అది వారి తప్పు కాదు. ఒకవేళ వారు ముందుగా అనుమతించి ఇప్పుడు నిరాకరిస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చును. కానీ వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకుపోయారు. ఇప్పుడు వారు అనుమతి నిరాకరించడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
ఇప్పుడు వైకాపా ముందు రెండే రెండు మార్గాలున్నాయి.1. తన దీక్షను విరమించుకోవడం. 2. అనుమతి లేకపోయినా దీక్షకి కూర్చోవడం. 3.హైకోర్టులో పిటిషన్ వేయడం. దీక్ష విరమించుకొంటే ఇంత శ్రమ వృదా అవుతుంది కనుక రెండవ మార్గం ఎంచుకోవలసి ఉంటుంది. కానీ అప్పుడు పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఫలితం ఉండదు. కనుక దీక్షకి అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయవచ్చును. కానీ హైకోర్టు కూడా ఆయన దీక్షకు అనుమతి నిరాకరిస్తే నవ్వులపాలవుతారు. కనుక ఆమరణ దీక్షని ఒకటో రెండో రోజుల దీక్షగా కుదించుకొంటే పోలీసులు కూడా అనుమతించే అవకాశం ఉంది. మరి వైకాపా నేతలు ఏమి నిర్ణయం తీసుకొంటారో వేచి చూడాలి.