ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రిత్ బుమ్రా
posted on Nov 25, 2024 3:19PM
ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యతతో నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జస్ప్రిత్ బుమ్రా నాయకత్వం వహించారు. సారథిగా బుమ్రా ముందుండి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకండా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆసీస్ ఓపెనర్లతో పాటు కీలకమైన స్మిత్ వికెట్ ను బుమ్రా తీసుకున్నాడు. ఆ తరువాత క్రీజ్ లో కుదురుకున్న ఎలెక్స్ కేరీ వికెట్ ను కూడా బుమ్రా పడగొట్టారు. ఆసీస్ కెప్పెట్ పాట్ కమ్మిన్స్ కూడా బుమ్రా ఖాతాలోనే పడ్డాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తాను వెసిన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. అసలే భారీ ఛేదన చేయాల్సిన ఆస్ట్రేలియా త్వరత్వరగా రెండు వికెట్లు కొల్పోవడంతో ఇక ఏ దశలోనూ తేరుకోలేకపోయింది. మొత్తంగా ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా 12 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి బుమ్రా 30 ఓవర్లు వేశాడు. 72 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ సెట్టింగ్ తో బుమ్రా ఆకట్టుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యి ఒత్తిడికి లోనైనప్పటికీ అద్భుతంగా పుంజుకున్నామని చెప్పారు.