అప్పుడూ.. ఇప్పుడూ అలీ జోకరేనా?
posted on Nov 25, 2024 10:14AM
టాలీవుడ్ టాప్ కమేడియన్ లలో అలీ ఒకరు. కేవలం కమేడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగానూ అలీ రాణించి యమలీల వంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. ఎలాగైనా చట్ట సభలో కూర్చోవాలన్న ఆకాంక్షతో ఆయన ఒక్కసారిగా రాజకీయాలలోకి దూకేశారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని అన్ని పార్టీలనూ చుట్టేసి చివరికి జగన్ నేతృత్వంలోని వైసీపీని ఎన్నుకున్నారు. ఆయన వైసీపీలో చేరడానికి ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరే విషయాన్నీ పరిశీలంచారు. కానీ చివరికి ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపారు. సినిమాల్లో ఏదో మేరకు హీరోగా రాణించిన అలీ.. రాజకీయాలలో మాత్రం కమేడియన్ గానే మిగిలిపోయారు.
2019 ఎన్నికలకు ముందు అలీ తన రాజకీయ అరంగేట్రం కోసం వేతుకులట ప్రారంభించారు. మూడు పార్టీల చుట్టూ చేరారు. ఏంటి మూడు పార్టీల్లోనూ చేరిపోతారా అనిపించేలా ఆయన వ్యవహరించారు. అయితే చివరాఖరికి ఆయన జగన్ ను నమ్ముకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలలో ఆయన ఏపీలోని ఏదో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే జగన్ ఆయనకు చెయ్యిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ ఏదో ఒక కీలక పదవి ఇస్తానని ఆశ చూపారు. దాంతో ఆ ఎన్నికలలో అలీ వైసీపీ తరఫున తన శక్తి మేరకు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఇక అలీ ఎదురుచూపుల పర్వం మొదలైంది. జగన్ హామీ ఇచ్చిన కీలక పదవి ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాచేలా అలి ఎదురు చూశారు. మధ్యలో ఓ సారి ఇంకేముంది రాజ్య సభ ఖాయం అని గట్టిగా వినిపించింది. అప్పట్లో రాజ్యసభ సభ్యత్వంపై అలీని మీడియా అడిగితే ఆయన చిరునవ్వులు సంధించి నిజమేనని చెప్పకనే చెప్పేశారు. అయితే అదీ రాలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తరువాత కంటితుడుపు చర్య అన్నట్లుగా జగన్ అలీకి ఓ సలహాదారు పదవి విదిల్చారు. అదే మహాభాగ్యం.. 2024లో పోటీకి అవకాశం ఇస్తారు అని అలీ తనకు తాను సర్ది చెప్పుకున్నారు. అయితే అదీ దక్కలేదు.
సో అలీ ఇక తన వంటికి రాజకీయాలు పడవని నిర్థారణకు వచ్చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇక సినిమాలే తన లక్ష్యం అని డిసైడైపోయారు. అప్పటి నుంచీ ఆయన వార్తల్లో ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. కానీ హఠాత్తుగా అలీ పేరు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే ఇది రాజకీయ విషయంలో కాదు. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారంటూ అలీకి తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కాదు. తెలంగాణలో.
అలీకి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ పంచయతీ ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలో తన తండ్రి మహ్మద్ బాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారంటూ వికారాబాద్ గ్రామ పంచయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. తొలుత ఈ నెల 5న ఇచ్చిన నోటీసులకు అలీ స్పందించకపోవడంతో తాజాగా సోమవారం (నవంబర్25) మరో నోటీసు ఇచ్చారు. మరీ దీనికైనా అలీ స్పందిస్తారో లేదో చూడాలి.