షర్మిల పార్టీకి తాళం వెనుక పీకే? షాక్ మాములుగా లేదుగా..

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ దూసుకొచ్చింది వైఎస్ షర్మిల. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడమే కాదు... వరుస సమావేశాలతో హడావుడి చేసింది జగనన్న బాణం. జిల్లాల వారీగా నేతలతో చర్చలతో పాటు ఖమ్మంలో సంకల్ప సభ కూడా నిర్వహించింది. వైఎస్సార్ జయంతి అయిన జూలై8న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపింది షర్మిల. అంతేకాదు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగి హంగామా చేసింది. దీక్షను పోలీసులు అడ్డుకోవడం, అయినా ఆమె పాదయాత్ర చేయడం.. పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకోవడం.. అంతా రచ్చరచ్చైంది. ట్విట్టర్ వేదికగానూ కేసీఆర్ పని తీరుపై ఘాటుగానే విమర్శలు చేస్తోంది షర్మిల. కొంత మంది నేతలు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో .. కొత్త పార్టీపై జనాల్లోనూ జోరుగా చర్చ జరిగింది. 

షర్మిల పార్టీ దూకుడు పెరుగుతుండగానే సడెన్ గా సీన్ మారిపోయింది. లోటస్ పాండ్ లోని షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడింది. కార్యకర్తలెవరు రావొద్దని షర్మిల పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ కార్యాలయానికి తాళం పడటంతో అంతా షాక్. కొవిడ్ కారణంతో మూసివేస్తున్నామని షర్మిల అనుచరులు చెబుతున్నా.. ఏదో జరిగిందనే చర్చే జరుగుతోంది. ఎందుకంటే కొవిడ్ పరిస్థితుల్లోనూ అన్ని పార్టీల కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూనే వివిధ పార్టీల నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల.. కార్యాలయానికి సడెన్ గా లాక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయానికి పడిన తాళం తాత్కాలికమా... సంపూర్ణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీకి తాళం పడటంపై మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

పీకే వల్లే షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడిందనే ప్రచారం జరుగుతోంది. పీకే... అంటే ప్రశాంత్ కిశోర్. దేశ రాజకీయాల్లో నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేను ఆయన పని చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నిఎత్తులు వేసినా.. పీకే ముందు పారలేదు. బెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. పీకే టీమ్ వర్క్ వల్లే జగన్ పార్టీకి ఘన విజయం దక్కిందని అంటారు. అంతటి పీకే... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యూహకర్తగా ఏ పార్టీకి ఎక్కడా పనిచేయబోనని ప్రకటించారు. ఇదే షర్మిల పార్టీ కార్యాలయం తాళానికి కారణమంటున్నారు. 

తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిలకు.. ఎన్నికల వ్యూహకర్తగా పీకే ఉంటున్నారనే ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ తెరపైకి రాగానే.. పీకే తెరపైకి వచ్చారు. కొత్త పార్టీ కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్ తో షర్మిల చర్చించారని, జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే ప్రచారం జరిగింది. తెలంగాణలో షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉండేలా పీకేను జగన్ ఒప్పించారని కొందరు వాదించారు. త్వరలోనే పీకే టీమ్ షర్మిల కోసం పని చేస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పీకే జెండా ఎత్తేయడంతో షర్మిల షాకైందని అంటున్నారు. పీకే సహకారం లేకుండా ముందుకు వెళ్లలేమని భావిస్తున్న షర్మిల... కొత్త పార్టీపై కొంత సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆమెకు ఇబ్బందిగా మారాయంటున్నారు. 

టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న రాజేందర్.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలు, తన మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈటల. కొంత ఆలస్యమైనా రాజేందర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు ఈటలకు సపోర్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా రాజేందర్ తో చర్చలు జరిపారు. కొండా దంపతులను తన పార్టీకి రమ్మని గతంలో షర్మిల ఆహ్వానించినా వారు నిరాకరించారు. ఇప్పుడు వాళ్లు రాజేందర్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీ పెడితే.. తమకు తెలంగాణ పాలిటిక్స్ లో ఏ మాత్రం స్పెస్ ఉండదనే ఆందోళనలో షర్మిల ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ వ్యతిరేకులు కొందరు తమతో కలిసి వస్తారని గతంలో షర్మిల భావించారు. కాని రాజేందర్ ఎంట్రీతో అటువంటి వాళ్లంతా ఆయనతోనే వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా షర్మిల పార్టీ కార్యాలయానికి తాళం పడటానికి కారణమని చెప్పుకుంటున్నారు .