2.4 కిలోల బంగారం స్వాధీనం.. 

బంగారం ఆ పేరు వింటే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని  ఉత్సహం, ఎందుకంటే ఆ బంగారు మేడలో వేసుకుంటే అందం తో పాటు ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే.. ఆ బంగారాన్ని ఈ మధ్య కాలంలో బాగా సరఫరా చేస్తున్నారు. తాజాగా  దుబాయ్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు రహస్యంగా తీసుకొస్తున్న బంగారాన్ని సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 2.4 కిలోల బరువు గల బంగారం బిస్కెట్లను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్యాంట్ల లోపలి భాగంలో పెట్టుకున్నారు. వారి తీరుపై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోదా చేయగా బంగారం గుట్టురట్టయింది. సుమారు రూ.1.2 కోట్ల విలువ చేసే బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.    

విశాఖ లో గంజాయి ముఠా అరెస్ట్.. 

గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా విశాఖ జిల్లాలో బీభత్సం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఎలమంచిలి వైపు నుంచి అనకాపల్లి వైపునకు వేగంగా వచ్చిన ఓ కారు కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద మహిళను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అదే వేగంతో ముందుకు వెళ్లిన కారు ‘యు’ టర్న్‌ తీసుకొనే క్రమంలో డివైడరుపైకి దూసుకెళ్లడంతో టైర్లు పేలిపోయాయి. వాహనంలో ఉన్న ఇద్దరు నిందితులు కిందకు దిగి అటుగా వస్తున్న లారీని నిలిపి కత్తులతో బెదిరించి ఎక్కడానికి ప్రయత్నించారు. క్లీనర్‌ వారిని నెట్టేయడంతో లారీ ముందుకు వెళ్లిపోయింది. అనంతరం ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని కత్తితో బెదిరించి, గాయపరిచి అతని వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. జాతీయ రహదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించగా అందులో సుమారు వంద కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. కారు ఢీకొని అపస్మారక స్థితికి చేరుకున్న గ్రామానికి చెందిన కలిగట్ల లక్ష్మి (35)ని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.