పిఠాపురం.. పవన్ కల్యాణ్ మెజారిటీపైనే అందరి ఆసక్తి!

ఏపీ ఎన్నికలలో  హాట్ సీట్లు అనదగ్గ వాటిలో మొదటిగా చెప్పుకోవలసింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దింపింది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని పవన్ కల్యాణ్ కు పోటీగా అదే కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను వ్యూహాత్మకంగా వైసీపీ పోటీలో నిలబెట్టింది. అలాగే కాపు సామాజికవర్గానికే చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది. పవన్ కు వ్యతిరేకంగా ముద్రగడ పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో మూడు రోజుల వ్యవధిలోకి వచ్చేసిన తరుణంలో ప్రచారం జోరందుకుంది.  

అయితే వాతావరణం మాత్రం పవన్ కల్యాణ్ కు పూర్తి అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పవన్ కు గట్టి బలంగా మారింది. పవన్ కల్యాణ్ కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరోలు, పలువురు సినీ, బుల్లితెర సెలిబ్రిటీలు సైతం పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలంటూ ఓ వీడియో సందేశం ద్వారా ఇచ్చిన పిలుపు కూడా నియోజకవర్గ ఓటర్లపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు పిఠాపురంలో పవన్ విజయం నల్లేరు మీద బండినడకేనని తేల్చేశాయి.

ఇక జనసేన శ్రేణులైతే పవన్ విజయం ఎప్పుడో ఖరారైందనీ, ఇప్పుడు తమ దృష్టింతా ఆయన సాధించబోయే మెజారిటీపైనేనని చెబుతున్నాయి. ఇక నియోజకవర్గంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించిన రాజకీయ పండితులు పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. కొన్ని సర్వే సంస్థలు కూడా ఆయనకు 75 వేల నంచి లక్ష ఓట్ల వరకూ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.   జగన్ సర్కార్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు తోడు కూటమి బలం, కాపు సామాజికవర్గం మద్దతు కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.