పిన్నెల్లి బ్రదర్స్ ఎన్‌కౌంటర్ ఖాయమా?
posted on May 23, 2024 3:03PM
పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ ఆరితేరిన దొంగల మాదిరిగా తప్పించుకు తిరుగుతున్నారు. నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారో, లేక ప్రభుత్వమే జాగ్రత్తగా తప్పిస్తోందో ఎవరికి తెలుసు? కాకపోతే బయటకి వచ్చే వార్తల లోతును తెలుసుకోలేని సాధారణ ప్రజలు పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారనే అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ వెంట పడుతున్నారని, వాళ్ళు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించకుంటున్నారని... ఇలా సినిమాల్లోని సీన్స్ ఊహించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పోలీసుల నుంచి ఇప్పటికే రెండుసార్లు తప్పించుకున్నారు. సాధారణంగా సినిమాల్లోగానీ, ఒక్కోసారి నిజంగా కూడా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేవారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేస్తూ వుంటారు. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కూడా అలాగే ఎన్‌కౌంటర్ అయిపోతారేమోనని అమాయక జనం అనుకుంటున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.
అలా సినిమా నాలెడ్జ్.తో ఫీలైపోతున్న అమాయక చక్రవర్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడం లేదు. ప్రభుత్వం, పోలీసులు చక్కగా వాళ్ళిద్దర్నీ కాపాడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలూ ఇంటి అల్లుళ్ళ మాదిరిగా అనుభవిస్తూ వాళ్ళు నీడపట్టున హ్యాపీగా వున్నారు. అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరూ ఎన్నికల ఫలితాలు విడుదలై, ఎన్నికల కోడ్ ముగిసే వరకూ బయటకి రారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక అప్పటి సంగతి అప్పుడు. మళ్ళీ రాబోయేది తమ రౌడీ రాజ్యమే కాబట్టి అప్పుడు తమకేమీ ఢోకా లేదని ఈ బ్రదర్స్ అనుకుంటూ వుండవచ్చు. కానీ, రాబోయేది రౌడీ రాజ్యం కాదు.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యం. అప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి సీన్ సితారైపోతుంది.