రుయా ఘటనపై హైకోర్టులో పిల్.. జ్యూడిషియల్ విచారణకు పిటిషన్..
posted on May 17, 2021 10:44AM
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కొవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో కోరారు. రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని పిల్‌లో తెలిపారు. రుయా ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని, కొవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలంటూ పిటిషనర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇటీవల ఆక్సిజన్ అందక తిరుపతి రుయా హాస్పటిల్‌లో 11మంది కొవిడ్ పేషెంట్స్ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్యపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడంతో.. రుయాలో ప్రాణవాయువు నిలిచిపోయి.. కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఆ మరణాలు సంభవించాయంటూ.. అందుకు సర్కారుదే బాధ్యత అంటూ విపక్షాలు ఆరోపించాయి. ఆక్సిజన్ నిల్వలను సమకూర్చుకోలేని చేతగాని సర్కారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, రుయా ఆసుపత్రి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జ్యూడిషియల్ విచారణ జరపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలవడం ఆసక్తికరంగా మారింది.