బాబోయ్.. అతిభీకర తుఫాను.. ఏపీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
posted on May 17, 2021 11:16AM
సడెన్‌గా వచ్చింది. సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు సునామీలా విరుచుకుపడుతోంది. ‘తౌక్టే’ తుఫాను దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ముంచేస్తోంది. ఇప్పటికే గోవా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తాజాగా, మరింత బలపడి ‘అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ప్రస్తుతం గుజరాత్ వైపు పయనిస్తున్న తౌక్టే.. మంగళవారం ఉదయం నాటికి భావనగర్ జిల్లాలోని పోర్‌బందర్-మహువా ప్రాంతం దగ్గర తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను హెచ్చరికలతో గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
తుపాను ఉద్ధృతి దృష్ట్యా ముంబయిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ముంబైలో వానలు మొదలైపోయాయి. దీంతో ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముంబయితో పాటు ఠాణె, రాయ్‌గఢ్, పాల్ఘర్ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను నిలిపివేశారు.
అటు, తుపాను ప్రభావంతో గుజరాత్ ప్రభుత్వం కూడా సహాయక బృందాలను సిద్ధం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుజరాత్ వెళ్లాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం 126 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మూడు వాయుసేన విమానాల్లో బయల్దేరివెళ్లారు. మరోవైపు ఇప్పటికే గుజరాత్ తీరంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని తాకే పోర్‌బందర్, మహువా ప్రాంతాల మధ్య లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 25వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కోరారు.