చార్మినార్ పెచ్చులు ఊడి పడ్డాయి!

హైదరాబాద్‌లో గురువారం (ఏప్రిల్ 3) కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం చిగురుటాకులా వణికింది.  అంత వరకూ వేసవి ప్రతాపాన్ని చూపుతూ భుగభగలాడిన భానుడిని ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేశాయి. ఆ వెంటనే కుండపోత వర్షం ఆరంభమైంది. రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులు వీచాయి, పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈ వర్షం ప్రభావం చారిత్రక కట్టడం చార్మినార్ పైనా పడింది. ఈ చారిత్రక కట్టడంపై నుంచి పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భారీ వర్షం కురుస్తుండటంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చార్మినార్ కు ఆనుకుని ఉన్న భాగ్యలక్మీ ఆలయం వైపు చార్మినార్ స్తంభంపైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

చార్ మీనార్ పెచ్చులు ఊడిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.   అయితే  ఇలా చార్మినార్ పై నుంచి పెచ్చులు ఊడిపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలా జరిగింది.   426 సంవత్సరాల పురాతన చార్మినార్ పరిరక్షణ, మరమ్మత్తులను అర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నది.  కాలుష్యం కారణంగా పగుళ్లు ఏర్పడుతున్నాయనీ, ఆ కారణంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనీ చెబుతున్నారు. ఈ పురాతన కట్టడం పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.