ఏ క్షణంలోనైనా రోజా అరెస్టు.. శాప్ ఎండీ రవినాయుడు

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అయ్యింది రోజా పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో   అందరిపై విరుచుకుపడిన మంత్రి రోజా ఇప్పుడు తన తీరుకు, మంత్రిగా ఉండగా చేసిన అక్రమ దందాలకు కేసుల ఉచ్చులో ఇరుక్కున్నారు. వరుస కేసులు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరౌతూ మౌనమే నాభాష అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్న సమయంలో రోజాపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అధికారం అండతో ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా పరిస్థితి ఆమె రాజీకీయ జీవితానికి ఎండ్  కార్డ్ పడబోతోందా అన్నట్లుగా తయారైంది. ఇప్పుడు ఆమెపై వస్తున్న ఆరోపణలేవీ నిరాధారమైనవి కావు.  అధికారం అండతో ప్రత్యర్థులపై మీడియా సమావేశాలు పెట్టి మరీ నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

వైసీపీ హయాంలో పార్టీ అధినేత జగన్ ను మెప్పించి మంత్రి పదవి దక్కించుకోవడానిక రోజా అప్పటి విపక్ష నేత అయిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలోనే జగన్ మెప్పు పొంది మంత్రి పదవీ దక్కించుకున్నారు. అయితే మంత్రిగా రోజా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనీ, దోచుకో.. దాచుకో అన్నట్లుగా పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనీ, ఆమె మంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమెకు కలెక్షన్ క్వీన్ అంటూ కొత్త బిరుదు కూడా ఇచ్చారు. అప్పట్లోనే మీడియా సమావేశాలు పెట్టి మరీ రోజా అవినీతిని కళ్లకు కట్టారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో రోజాపై కేసులు నమోదు కాలేదు. అయితే జగన్ ప్రభుత్వం గద్దె దిగి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఒక్కటొక్కటిగా రోజా అనినీతి వ్యవహారాలపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమౌతోంది.   
తాజాగా నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిపై తెలుగుదేశం యువనేత, శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రిగా ఉండగా రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఇష్టారీతిగా అవినీతికి పాల్పడ్డారని  తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. క్రీడా పరికరాల కోనుగోళ్లలో 119 కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదోవపట్టించారని రవి నాయుడు ఆరోపించారు. అంతే కాకుండా తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారంలో కోట్లాది రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో  వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా త్వరలోనే అరెస్ట్ కావడం పక్కా అని టీడీపీ యువ నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు.   వైసీపీ   హయాంలో   ఆడుదాం ఆంధ్ర లో అక్రమాలు, తిరుమల టికెట్ల దండా వ్యవహారాలలో విచారణ కొనసాగుతోందని రవి నాయుడు చెప్పారు. అలాగే  టూరిజం శాఖతో పాటు నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందన్న రవినాయుడు.. ఈ దర్యాప్తులో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రోజా భయపడుతున్నారన్నారు.  రోజా అక్రమాలు, అవినీతిపై పక్కా ఆధారాలు ఉన్నాయనీ, ఆమె   ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయనీ చెప్పారు.  అరెస్ట్ భయంతో నెల రోజులు అజ్ణాతంలో గడిపిన రోజా,  జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడితో ఇప్పుడు బయటకు వచ్చి నామ్ కే వాస్తే ప్రెస్ మీట్లతో  ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.ప్రెస్ మీట్లలో ఆమె మాటలు వింటేనే ఆమె ఎంత భయపడుతున్నారో అవగతమౌతుందన్నారు.