నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాపు వేగం పుంజుకుంది. నిన్నటి వరకూ అధికారులకు నోటీసులు, వారి విచారణలకే పరిమితమైన పోలీసులు ఇప్పుడు రాజకీయ నాయకులకూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకరరావును అమెరికా నుంచి తీసుకువచ్చి విచారించాలన్న పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసినా ఫలితం లేకపోయింది. దానికి తోడు ఇటీవల ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు కూడా రావడంతో ఇక ఆయన విచారణ ఇప్పట్లో సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన పోలీసులు మిగిలిన నిందుతులపై దృష్టి సారించారు.

ఈ కేసు కేవలం అధికారులకే పరిమితం కాదనీ, రాజకీయ పెద్ద తలకాయలకు కూడా ఇందులో ప్రమే యం ఉందనీ మొదటి నుంచీ ఆరోపణలు వినవస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా సోమవారం (నవంబర్ 11)న పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చి విచారణకు రావలసిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు ఫోన్  ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు.

ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందినట్లు చెబుతున్నారు. తమ విచారణలో భాగంగా లభించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.