జనంలో బీజేపీపై వ్యతిరేకత రాహుల్ కు కలిసొస్తుందా?
posted on May 9, 2023 9:55AM
బిజెపి నిరంకుశ విధానాలపై ప్రజల్లో అసహనం రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలు వరుస దాడులు, కేసులతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నతీరు పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేరుగా మోడీనే తాకుతున్నదని అంటున్నారు.
వెూడీ, షా ద్వయం తమను గట్టిగా ఢీ కొంటున్న నేతలను కావాలనే వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది. కాగా కేంద్రం అనుసరిస్తున్న తీరు , ఆ తీరును దీటుగా ఎదుర్కొంటున్నరాహుల్ ను జనం గమనిస్తున్నారు. యిప్పుడిప్పుడే రాహుల్ లోని నాయకత్వ లక్షణాలను వారు గుర్తిస్తున్నారు. తనపై అనర్హత వేటు వేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్పందన పరిణితి చెందిన నేతగా ఉంది. అంతే కాకుండా అనర్హత వేటు పడిన వెంటనే ఎంపీగా కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయాలని రాహుల్ కు హుకుం జారీ చేయడం, అందుకు బదులుగా నిబంధనల ప్రకారం గడువులోపు ఖాళీ చేస్తానని ఆయన ప్రకటించడం ద్వారా రాహుల్ తన నిజాయితీ చాటుకున్నారు.
గుజరాత్ కోర్టు తీర్పు, తరవాత పైకోర్టుల్లో లభించని ఊరట తదితర అంశాలన్నీ రాహుల్‌కు కలసి వస్తున్నాయి. ఎంపీగా అనర్హత వేటు పడిన తరువాత రాహుల్ పట్ల జనంలో అభిమానం పెరిగింది. అదే సమయంలో ప్రధాని వెూడీ ఇమేజ్ మసకబారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా నెహ్రూ కుటుంబానికి చెందిన వారెవరినీ పార్లమెంట్ గడప తొక్కకుండా చేయాలన్న పట్టుదలలో వెూడీ ఉన్నారని భావన కూడా ప్రజలలో విస్తృతంగా వ్యక్తం అవుతోంది. ఒకప్పుడు తాను బీజేపీ అగ్రనాయకులైన వాజపేయి, ఎల్.కె.ఆద్వాణి వంటి వారికి అనుచరుడిగా, సహాయకుడిగా పరిచర్యలు చేసిన విషయం వెూదీ మరచిపోయాడు.
అధికారంలోకి రాగానే అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి ఉద్దండులను పక్కన పెట్టారు. రాహుల్ గాంధీ విషయంలో వెూడీ హుందాగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు పునాదులు పడేవికావు. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ప్రధాని వెూదీ విజయానికి తిరుగుండదన్న అభిప్రాయం నిన్న మొన్నటి దాకా ఉంది. అయితే ఇందిరాగాంధీ లాంటి వారే మట్టి కరిచారు. ప్రాంతీయ పార్టీల నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకున్నందున సంతృప్తి చెంది ఉండాల్సింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ఉండకూడదు అనుకోవడం మాత్రం సరికాదు. ఒకప్పుడు బీజేపీ ఉనికిని కాంగ్రెస్ సహించేది కాదు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది చూస్తున్నాం. రేపు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సహజ న్యాయం అని ఒకటి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. కానీ ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయవచ్చు. అధికధరలు, జిఎస్టీ వాయింపులు, పెట్రో ధరలు ప్రజలను సూదుల్లా పొడుస్తున్నాయి. వీటిని భరించే శక్తి లేనప్పుడు తిరుగుబాటు గురించి ఆలోచిస్తారు.
దేశంలో పరిస్థితి యిప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. ప్రజల ఆగ్రహం ఓడలను బండ్లు, బండ్లను ఓడలు చేస్తుంది. కర్నాటక ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.