జనం డిసైడైపోయారు.. తేడా తెలిసిపోయింది!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్  ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 

ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్లూ రాష్ట్రంలో పాలన సాగించింది. ఇక ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మూడో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో తేల్చనున్నారు. ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో అంటే మే 13న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి తమ తమ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. 

వైసీపీ,  తెలుగుదేశం కూటమిలలో  ఈసారి విజయం ఎవరిదన్న విషయాన్ని ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చి చెప్పేశాయి.  వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని పరిశీలకులు సైతం సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీపై   ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? ఐదేళ్ల పాలనలో జగన్ పట్ల అంతటి విముఖత ఎందుకు కలిగింది? అన్న ప్రశ్నకు సమాధానంగా ఐదేళ్ల చంద్రబాబు పాలన, ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూస్తే చాలు.  

ఇంకొంచం వివరంగా చెప్పాలంటే.. రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల పాలన ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు, జగన్ ల పనితీరును కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికి ఇవ్వాలి..  మరోసారి సీఎంగా ఎవరిని చూడాలనేది ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చేసింది. సర్వేలు చూసినా, విశ్లేషకుల అభిప్రాయాలను గమనించినా.. ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతుంది. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన జనం  ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో  మే 13న తమ ఓటు ద్వారా చెప్పేస్తారు.  

అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొని మరీ జనం తమ తీర్పు చెప్పడానికి రెడీ అయిపోయారు.

అయితే, చంద్రబాబు, జగన్ పాలనలను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే అనిపిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తె జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్ధిక  అరాచకత్వాన్ని ప్రదర్శించి.. పన్నుల రూపంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపారు. చంద్రబాబు ఇతర దేశాలలో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే.. జగన్ హయంలో ఏపీలో ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు-ఘోరాలలో జగన్ సర్కార్ దేశంలోనే ముందు వరుసకు చేరింది.  ఏకంగా దళితుడిని చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంటపెట్టుకొని తిరగడంతో  జగన్ నేరాలకు కొమ్ముకాస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడింది. 

విద్యా, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించేదేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు మేలు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనం కూడా చంద్రబాబు, జగన్ పాలనల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించారు. అందుకే  చంద్రబాబు పాలనకే మొగ్గు చూపుతున్నారు.  అందుకు ఇప్పటికే వెలువడినడజనుకు పైగా సర్వేలు చంద్రబాబే సీఎం అని తేల్చేశాయి. వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశాయి. అలాగే  ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపిస్తున్న ప్రజాదరణ, ప్రజా స్పందనలను చూసినా ఆ విషయం అర్ధమైపోతుంది.  

తెలుగుదేశం కూటమి సభలకు జనం పోటెత్తుతుంటే.. వైసీపీ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. చివరాఖరికి పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రచారానికి కూడా జనం ముఖం చాటేస్తున్నాయి. డబ్బులు ఇచ్చి, మందు పోసి సమీకరించిన వారు కూడా ఇలా కనిపించి అలా మాయమైపోతున్నారు. దీంతో ఐదేళ్ల జగన్ పాలనను అంతుకు ముందు ఐదేళ్ల చంద్రబాబు పాలనతో పోల్చి చూసుకుని రాష్ట్ర ప్రగతి, పురోగతి, నిజమైన ప్రజా సంక్షేమం కావాలంటే చంద్రబాబు మఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టా ల్సిందేనన్నదే జనాభిప్రాయమనీ, అదే సర్వేలలో ప్రతిఫలిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.