జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డే కారణమా?

జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల జడివాన కురిపించడానికి ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్.. ఏడేళ్ల పసిపాప హత్య ఉదంతాన్ని కూడా కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించడానికి వాడుకోవడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి పుంగనూరు పర్యటనకు రెడీ అయిపోయారు. అయితే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకునేలా చేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. 

ఏడేళ్ల చిన్నారి అస్పియా గత నెల 29న అదృశ్యమైంది. ఆ తరువాత ఆమె మృతదేహం ఒక సమ్మర్  స్టోరేజ్ ట్యాంక్ లో లభ్యమైంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందంటూ గగ్గోలు పెట్టింది.  అయితే ఈ సంఘటనపై వేగంగా స్పందించిన పోలీసు యంత్రాంగం ఇద్దరు అనుమా నితులను అరెస్టు చేసింది. ప్రభుత్వం కూడా బాలిక తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా బాలిక హత్య వెనుక ఆర్థిక కారణాలున్నాయని తేలింది. బాలిక తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపార లావాదేవీలలో ఉన్న గొడవల కారణంగా ఆయనపై కక్ష పెంచుకున్న వారు బాలికను హత్య చేశారని వెల్లడైంది.

ఈ లోగానే మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే  వైసీపీ నేతలు బాలిక పేరు, వివరాలు వెల్లడించారు. సున్నితమైన ఇటువంటి విషయాలలో బాధితురాలి పేరు వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను ఉల్లంఘించారు. రాజకీయ విమర్శలను పట్టించుకోకుండా పోలీసులు మాత్రం బాలిక హత్య కేసు ఛేదించే విషయంలో ముందుకు సాగారు. అయితే వీటిని వేటినీ పట్టించుకోకుండా ఒక శవం దొరికింది.. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చెండాడేయవచ్చు అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుంగనూరు పర్యటనకు సిద్ధమైపోయారు.  బుధవారం (అక్టోబర్ 9) న ఆయన పుంగనూరులో పర్యటించాల్సి ఉంది.

అయితే ఈ లోగానే చిన్నారి హత్య కేసులో రాజకీయ లబ్ధి సాధ్యంకాదన్న విషయం తేలిపోయింది. పైపెచ్చు ఈ సమయంలో జగన్ పుంగనూరులో పర్యటిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తధ్యమని భావించిన పెద్దిరెడ్డి జగన్ ను పర్యటన రద్దు చేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పటికే పుంగనూరులో పెద్దరెడ్డి ఆయన కుమారుడి పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. బాలిక హత్య కేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించడం, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి స్పష్టమైన భరోసా లభించడంతో జగన్ పర్యటన వల్ల ప్రయోజనం ఉండదని నిర్దారించుకున్నా పెద్దిరెడ్డి జగన్ పర్యటనకు  రాకుండా అడ్డుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.