పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బహిష్కరించిన ఎస్పీ!

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎదురే లేదన్నట్లుగా విర్రవీగిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అనంతపురం జిల్లా ఎస్పీ నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు. స్థాయి మరిచి రెచ్చిపోయిన పెద్దారెడ్డిని పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య నియోజకవర్గం నుంచి అనంతపురం తరలించారు. ఇకపై నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పని సరి అని స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గంలో చెలరేగిని హింసాకాండ నేపథ్యంలో ఎస్పీ కేతిరెడ్డి నియోజకవర్గ ఎంట్రీపై బహిష్కరణ అస్తరం ప్రయోగించారు. ఈ మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టరాదన్నది ఆ నోటీసుల సారాంశం. 

ఎన్నికల ఫలితాల అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రతిసారీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డి ప్రజెన్స్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని భావించిన పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా ఆయన నియోజకవర్గంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు.   తాజాగా ఇటీవల పెద్దారెడ్డి తన నివాసానికి వచ్చిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి.

ఈ ఘర్షణల్లో వాహనాలు దగ్ధం అయ్యాయి,  ఆస్తి నష్టం సంభవించింది. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని నియోజకవర్గం బయటకు సాగనంపారు. పటిష్ఠ బందోబస్తు మధ్య పెద్దారెడ్డిని అనంతపురంకు తరలించిన పోలీసులు ఇకపై ముందస్తు అనుమతి లేకుండా నియోజకవర్గంలోకి ప్రవేశించవద్దని నిషేధం విధించారు.  తాడిపత్రి నియోజకవర్గంలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, పర్యవేక్షించిన డీజీపీ నియోజకవర్గంలో హింసాకాండకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలో తెలుగుదేశం, వైసీపీకి చెందిన కీలక నేతల ప్రజన్స్ వల్లనే తాడిపత్రిలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పుతోందని డీజీపీ పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగానే ఎస్పీ పెద్దారెడ్డిని నియోజకవర్గంలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.