కదిలింది కదిలింది వారాహి!
posted on Jun 14, 2023 10:56AM
వారాహి కదిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైంది. ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, ఎన్నికల ప్రచార యాత్రగా కూడా పవన్ వారాహి ద్వారా బహుముఖ దండయాత్రకు ప్లాన్ చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో సాగే ఈ యాత్రలో భాగంగా కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరం మీదుగా సాగుతుంది. పైన చెప్పిన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడతారు. పర్యటన సాగిన ప్రాంతాల్లో ఉదయం పూట సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉదయం జనవాణి కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. పిఠాపురం, కాకినాడ, నర్సాపురంలో క్షేత్రస్థాయి సందర్శనలు ఉంటాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని జనసేన శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నారు. కాగా విడదల వారీగా సాగే జనసేనాని వారాహియాత్ర తొలి విడత ఈ నెల24 వరకు యాత్ర సాగనుంది. బుధవారం (జూన్ 13) కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడతారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20 ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న రాజోలులో బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు.
యాత్రలో రోజూ మేధావులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తుల వారితో పవన్ మాట్లడబోతున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్త దాదాపుగా ఖరారైందని భావిస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతానికి క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం శ్రేణులు కలిసి పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.