చిగురుటాకులా వణకుతున్న గుజరాత్ తీరం
posted on Jun 14, 2023 10:34AM
బిపర్ జోయ్ ప్రళయ భీకరంగా దూసుకొస్తోంది. ఆ తుపాను ధాటికి గుజరాత్ తీరం చిగురుటాకులా వణికి పోతోంది. బిపర్ జోయ్ గుజరాత్ లోని ఖజౌ వద్ద గురువారం (జూన్14) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తుపాను ప్రభావం అప్పుడే గుజరాత్ పై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే సౌరాష్ట్ర, కచ్ తీరాల్లో అలలు 6 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందనీ, వీటి వల్ల తీవ్ర విధ్వంసం సంభవించే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తమౌతోంది.
ఇప్పటికే తీరం వెంబడి గాలుల తీవ్రత కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తుపాను కారణంగా ఇప్పటికే ముగ్గురు మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత స్ధావరాలకు తరలిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి హస్తిన నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.