వారాహికి రంగు పడుద్దా!

జనసేనానిపవన్ కల్యాణ్ ఎన్నికల రథం ‘వారాహి’కి రంగుపడుద్దని ఏపీ అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు మాటలను బట్టి అవగతమౌతోంది. అయినా జనసేనాని తన ఎన్నికల ప్రకార వాహనం ‘వారాహి’ ఫొటోలను విడుదల చేసిన క్షణం నుంచీ దానిపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చైతన్యరథంను స్ఫురింప చేసేదిగా తన ఎన్నికల ప్రచార వాహనం ఉండాలని ఎంతో ముచ్చట పడి దానిని తీర్చిదిద్దుకున్నారు పవన్ కల్యాణ్. అయితే ఆ వాహనానికి ఆలీవ్ గ్రీన్ కలర్ విషయంలో ఆయన నిబంధనలను మరచిపోయారు.

కేంద్ర వాహన చట్టం ప్రకారం ఆర్మీ వెహికిల్స్ కు తప్ప మరే వెహికిల్ కూ ఆలీవ్ గ్రీన్ రంగు వాడటం నిషేధం. దీంతో ఎంతో ముచ్చటపడి తయారు చేయించుకున్న వాహనానికి పవన్ కల్యాణ్ ఇప్పుడు రంగు మార్చక తప్పదు. ఎన్టీఆర్ చైతన్య రథం ఆలీవ్ గ్రీన్ కలర్ లో ఉందంటే.. అప్పటికి ఈ నిబంధన లేదు. ఇప్పుడున్న  ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్‌లో క  అలీవ్ గ్రీన్ రంగు.. మిలటరీ వాహనాలకు తప్ప.. మరి ఏ ఇతర వాహనాలకూ ఉండకూడదు. ఆలీవ్ గ్రీన్ ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరు. ఆ రంగులో వాహనాలను నడపడానికి  అంగీకరించరు అందుకే ఇప్పటి వరకూ మోటార్ కంపెనీలు ఏవీ కూడా అలీవ్ గ్రీన్ రంగు వాహనాలను అమ్మలేదు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ వారాహికి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.

ఇప్పటికే ఏపీ రవాణా శాఖ మాజీ మంత్రి  పేర్ని నాని పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై తన అభిప్రాయం చెబుతూ ఆలీవ్ కలర్ రంగుతో ఆ వాహనం ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఉండదని స్పష్టం చేసేశారు. రంగు మార్చుకోవాల్సిందేనని చెప్పేశారు. రంగు ఒక్కటే కాకుండా ఇంకా పలు విషయాలలో వారాహి వాహనంపై, దానిని వినియోగించడానికి అనుమతులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఒక వేళ ఇప్పటికీ ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ అవ్వక పోతే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అది గూడ్స్ వెహికలా , ప్యాసింజర్ ప్యాసింజర్ వెహికలా, ట్రాన్స్ పోర్టు వెహికిలా  అన్నది తెలపాల్సి ఉంటుంది. ఒక వేళ  ట్రాన్స్ పోర్ట్ వెహికల్ అయితే దానిని గూడ్స్ వెహికల్ గా మార్చకూడదు, గూడ్స్ వెహికల్ అయితే క్యాంప్ వ్యాన్ గా మార్చకూడదని ఏపీ అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. రిజిస్ట్రేషన్ రోజు ఆ వెహికల్ బాడీ, హైట్ , వెడల్పు అనేది పరిమాణం తగ్గట్టు ఉందా లేదా అని చూస్తారని చెప్పారు.

మొత్తం మీద ఏపీలో ఉన్న రాజకీయ పరస్థితుల దృష్ట్యా అక్కడ అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం విషయంలో చిన్ని పాటి లోటు పాట్లు ఉన్నా అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టించడం తథ్యం. మాజీ మంత్రి పేర్ని నాని మాటలను బట్టే ఆ సంగతి స్పష్టమౌతోంది. ఈ పరిస్థితులలో వారాహి ఏపీ రోడ్లపై పరుగులు తీయడానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి అనుకున్న షెడ్యూల్ ప్రకారం పవన్ వారాహిపై రాష్ట్ర పర్యటన సాధ్యమౌతుందా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.