పెళ్లిని ఆపేసిన ముక్కు!

ఏవేవో కారణాలతో పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనలెన్నో ఉన్నాయి. పీటల మీద పెళ్లి ఆగిపోవడానికి చిన్న చిన్న విషయాలు కూడా కారణమౌతున్నాయి. పెళ్లి విందులో చికెన్ లేదనీ, పీటల మీద వరుడు కట్టుకున్న పంచె ఊడిపోయిందనీ.. ఆఖరికి తాళి కట్టగానే అందరి ముందూ వరుడు తనను ముద్దు పెట్టుకున్నాడనీ.. ఇలా ఎవేవో కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

మర్యాదలు, కట్నకానుకలు, ప్రేమ వ్యవహారాలూ ఇలా చాలా చాలా కారణాలతో పెళ్లిళ్లు పీటలమీదే పెటాకులైన సందర్బాలు ఉన్నాయి. కానీ తాజాగా ఓ పెళ్లి కూతురు పీటల మీద పెళ్లి రద్దు చేసుకోవడానికి చెప్పిన కారణం మాత్రం అందరినీ విస్మయ పరుస్తోంది. ఇంతకీ పెళ్లి వద్దనడానికి పెళ్లి కూతురు చెప్పిన కారణం వరుడి ముక్కు. ఔను మీరు విన్నది నిజం.. వరుడి ముక్కు కారణంగానే పెళ్లి కూతురు పీటల మీద పెళ్లి వద్దనుకుంది.

వరుడి ముక్కు చిన్నగా ఉందంటూ పెళ్లి కూతురు పెళ్లిని నిరాకరించింది. ఆ అమ్మాయి చెప్పిన కారణం విని పెళ్లి కొడుకు సహా అందరూ విస్తుపోయారు. ఈ సంఘటన యూపీలోని సంభాల్ లో జరిగింది. పెళ్లికి వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికి తరలి వచ్చింది.

పెళ్లి కొడుకును చూసిన అమ్మలక్కలు వరుడి ముక్కు చిన్నగా ఉందంటూ చేసిన కామెంట్లు పెళ్లి కూతురి చెవిన పడటంతో  చిన్న ముక్కున్న పెళ్లి కొడుకు తనకు వద్దంటూ పెళ్లి కూతురు మొండికేసింది. ఎంత నచ్చ చెప్పినా పెళ్లి కూతురు వినకపోవడంతో  వరుడి కుటుంబం వెనుదిరిగింది.