మొగల్తూరు, పెనుగొండలలో పవన్ పర్యటన 28న

శ్రీమంతుడు సినిమాలో ఊరు చాలా ఇచ్చింది.. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాను అనే డైలాగ్ ఒకటి ఉంది.   పుట్టి పెరిగిన ఊరు అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలన్న సందేశం ఆ డైలాగ్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను పుట్టి పెరిగిన గ్రామాల కోసం ఏదైనా చేయాలని తపన పడుతున్నారు. వాటి రుణం తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారు. 
అందుకే తాను పుట్టి పెరిగిన మొగల్తూరు అభివృద్ధిపై దృష్టి సారించారు.  ఈ నేపథ్యంలోనే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, పెనుగొండలలో పర్యటించనున్నారు. మొగల్తూరుతో పాటు పెనుగొండతో కూడా పవన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ప్రత్యేకంగా ఆ రెండు గ్రామాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆయా గ్రామాలలో ప్రజల సమస్యలన తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కూడా చేయనున్నారు.  
ఈ నెల 28 ఉదయం మొగల్తూరు. సాయంత్రం పెనుగొండ గ్రామాలలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ రెండు గ్రామాలలోనే గ్రామ సభలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రామాభివృద్ధి కి సంబంధించిన ప్రతిపాదనలు స్వీకరిస్తారు. రెండు గ్రామాలలో  మౌలిక వసతుల కల్పన, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.