హస్తినకు పవన్.. అమిత్ షాతో భేటీ.. విషయం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం (నవంబర్ 6) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో పాల్గొంటారు. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెడతారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పోలీసుల పనితీరు, హోంమంత్రి వంగలపూడి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో హఠాత్తుగా పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అప్పాయింట్ మెంట్ ఫిక్సయ్యిందని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ కు హస్తిన నుంచి పిలుపు వచ్చిందా? లేక ఆయనే అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఇలా ఉండగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ చేతికి ఆయుధం అందించినట్లుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలలో విభేదాలు ఉన్నాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయంటున్నారు. కూటమి ఐక్యత బీటలు వారిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.  ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా  ఉంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం, జనసేనల మధ్య గ్యాప్ ను సూచిస్తున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది. ఒక వేళ పవన్ స్వయంగా అప్పాయింట్ మెంట్ కోరి మరీ అమిత్ షాను క లిసేందుకు హస్తిన పర్యటన పెట్టుకుంటే.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుని, రాష్ట్రంలో పరిస్థితులను ఆయన తెలియజేస్తారనీ, అలా కాకుండా అమిత్ షాయే పవన్ కల్యాణ్ ను హస్తినకు పిలిచి ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలను బహిరంగంగా వెల్లడించడమేంటని క్లాస్ పీకుతారనీ అంటున్నారు. ఏది ఏమైనా పవన్ వ్యాఖ్యలు  రాజకీయంగా పెనుదుమారం రేపాయనడంలో సందేహం లేదు.