వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రాఘవరెడ్డి అరెస్టు
posted on Nov 6, 2024 9:53AM
నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందా? జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని సరిహద్దులనూ దాటేసి ఇష్టారీతిగా అడ్డగోలుగా వ్యవహరించిన ఒక్కొక్కరిపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమైందా అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా జగన్ అడ్డా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పులివెందులలో మంగళవారం (నవంబర్ 5) అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో వర్రా రవీంద్రరెడ్డి సోషల్ మీడియా వేదికగా విపక్ష నేతలపై అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయారు. అప్పట్లో జగన్ అండ ఉండటంతో ఎన్ని ఫిర్యాదులు అందినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా వర్రా రవీంద్రరెడ్డి ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు టార్గెట్ గా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి.
రవీందర్‌రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అంతేకాదు రవీంద్ర రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేకా హత్యకేసులో జగన్, అవినాష్‌రెడ్డిపై విమర్శలు చేసిన షర్మిల, సునీతపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అప్పట్లో ఆ పోస్టుల్లో.. అవసరమైతే సునీతను కూడా లేపేయండి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ తల్లి విజయమ్మపైనా పోస్టులు పెట్టడం సంచలనంరేపింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీంద్ర రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అదలా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. కూటమి నేతలపై అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో ఆయనపై మంగళగిరితో పాటు పలు ప్రాంతాల్లో, అలాగే హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసలు వర్రారాఘవరెడ్డిని పులివెందులలో అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. వర్రారవీందర్ రెడ్డి జగన్ అండతోనే సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై చెలరేగిపోయి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారనడానికి ఆయన జగన్, భారతిలతో దిగిన ఫొటోలే సాక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.