గతం!

అనగనగా ఓ చిట్టి పావురం ఉండేది. దానిదో స్వేచ్ఛా జీవితం! ఆకలేస్తే ఇన్ని గింజలు తినడం. ఆశాశంలోకి రివ్వుని ఎగరడం. అలా జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న పావురానికి ఓ అలవాటు మొదలైంది. తన మనసుని ఎవరైనా నొప్పిస్తే ఆ విషయాన్ని సహించలేకపోయేది. ఆ విషయాన్ని గుర్తుంచుకునేందుకు ఓ వింత పద్ధతిని మొదలుపెట్టింది. తన మనసు నొచ్చుకున్న ప్రతిసారీ ఓ గులకరాయిని మూటగట్టుకునేది. తను ఎక్కడికి వెళ్లినా ఆ రాళ్లను కూడా తనతో పాటు తీసుకువెళ్లేది. తరచూ ఆ రాళ్లని చూసుకుంటు కాలక్షేపం చేసేది పావురం. అందులో ఏ రాయి ఏ సందర్భంలో పోగేసిందో దానికి గుర్తే!


రోజులు గడిచేకొద్దీ రాళ్ల బరువు కూడా పెరిగిపోయింది. ఇదివరకులా వాటిని మోసుకుంటూ ఎక్కువ దూరం వెళ్లలేకపోయేది పావురం. కానీ దాని అలవాటు మానుకోలేదు సరి కదా… చిన్ని చిన్న విషయాలకే రాళ్లను పోగేయడం మొదలుపెట్టింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా! పావురం ఉండే చోటకి కరువు వచ్చిపడింది. చెట్లన్నీ మలమలా ఎండిపోయాయి. చెరువులన్నీ అడుగంటిపోయాయి.
`మనం ఆ కనిపించే కొండల వైపుకి వెళ్లిపోదాం పద నేస్తం` అని మన పావురానికి ఓ నేస్తం సలహా ఇచ్చింది.
`నాక్కూడా అక్కడికి వెళ్లాలనే ఉంది. కానీ ఇంత బరువుని మోసుకుని కదల్లేకపోతున్నాను` అని బదులిచ్చింది పావురం.
`అలాంటప్పుడు వాటిని మోసుకుంటూ తిరగడం ఎందుకు. అవతల పారేయరాదా` అంది నేస్తం.
`పారేయడానికనుకున్నావా నేను పోగేసుకుంది. వీటిలో ప్రతి ఒక్కటీ నా గాయాలకు ప్రతీక` అంది పావురం.
`పాత గాయాలను పోగేసుకుంటూ ఉంటే వాటి బరువుతో ముందుకు పోలేవు. నా మాట విని వాటిని వదిలెయ్యి` అంది నేస్తం.
`అసంభవ౦. వాటిని వదిలి నేనుండలేను. అవి నా జీవితంలో భాగమైపోయాయి. వాటిని వదులుకోవడమంటే నా గతాన్ని వదులుకోవడమే. అంత ధైర్యం నేను చేయలేను` అంది పావురం.

 

పావురాన్ని వదిలేసి నేస్తం ఎగిరిపోయింది. పావురం మాత్రం తను పోగేసిన రాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. కరువు విజృంభించింది. పావురానికి ఎండుగింజలు సైతం దొరకలేదు. నోరు తడుపుకునేందుకు చుక్కనీరు కూడా మిగల్లేదు. అయినా తన గతం తాలూకు బరువుని వదిలి వెళ్లేందుకు దానికి మనసు రాలేదు. అక్కడే ఆ పాత చోటే అర్థంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది.