కేబినెట్ లోకి పల్లా! వాణిదేవీకి కీలక పదవి
posted on Mar 23, 2021 5:22PM
తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లలో విజయం సాధించింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీకి సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కూతురు వాణిదేవీ సంచలన విజయం సాధించారు. నిజానికి ఈ రెండు సీట్లలో గులాబీ పార్టీకి ఏమాత్రం గెలిచే అవకాశం లేదని అంతా భావించారు. అందుకే అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం జరిగింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీకి మొదట వెనుకంజ వేసినా.. సీఎం సూచనతో రంగంలోకి దిగారంటున్నారు. ఇక హైదరాబాద్ స్థానంలో వాణిదేవీని చివరి నిమిషంలో బరిలోకి దింపారు గులాబీ బాస్.
ప్రతికూల పరిస్థితిల్లో పోటీలో దిగి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణిదేవీకి కీలక పోస్టులు దక్కనున్నాయని తెలుస్తోంది. తనకు నమ్మకస్తుడిగా ఉన్న పల్లాను కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. కొంత కాలంగా పాలనతో పాటు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అంతా ఆయన డైరెక్షన్ లోనే జరిగింది. కేబినెట్ లో లేకపోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనదే హవా నడుస్తుందనే చర్చ ఉంది. తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎమ్మెల్సీగా గెలవడంతో పల్లా ఇమేజ్ మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా వ్యూహాల ముందు విపక్షాలు చిత్తయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై తీవ్ర కోపంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకోవడంలో పల్లా సక్సెస్ అయ్యారని అంటున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లోనూ విపక్షాలకు పల్లా చుక్కలు చూపించారనే చర్చ జరుగుతోంది. మొత్తంగా తమకు కష్టమనుకున్న సీటులో గెలిచి.. వరుస ఓటములతో డీలా పడిన పార్టీలో జోష్ వచ్చేలా చేసిన పల్లాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
కేసీఆర్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు. పల్లాను తీసుకుంటే ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే... ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి కేసీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు.
ఇక బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ లో టీఆర్ఎస్ పోటీ చేయడం లేదనే ప్రచారం జరిగింది. అభ్యర్థులు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుని నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని కూడా అన్నారు. కాని అనూహ్యాంగా బరిలోకి దిగిన వాణిదేవీ... అద్భుత విజయం సాధించారు. నిజానికి హైదరాబాద్ స్థానంలో పోటీకి వాణిదేవీ సిద్దం కావడమే సంచలనం అంటున్నారు. ఓడిపోయే సీటు అని తెలిసినా ఆమె ఎందుకు పోటీ చేస్తున్నారో అంటూ విపక్షాలు సెటైర్లు కూడా వేశాయి. అయినా ధైర్యంగా పోటీ చేసిన వాణీదేవీ.. అనూహ్య విజయం సాధించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ విక్టరీకి వాణీదేవీ అభ్యర్థిత్వమే కారణమని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. అందుకే వాణిదేవీని ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధినేతకు ఇదే సూచన చేశారని తెలుస్తోంది.
వాణిదేవీకి ఏ పదవి కట్టాబెట్టాలన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పలు విద్యాసంస్థలకు అధినేతగా ఉన్న వాణిదేవీకి విద్యాశాఖ మంత్రి అయితే సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితాఇంద్రారెడ్డిని రెండో దశలో కేబినెట్ లోకి తీసుకున్నారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె నిలిచారు. దీంతో ఆమెను తప్పిస్తే బాగుండదనే చర్చ గులాబీ నేతల్లో జరగుతుందట. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు. ప్రస్తుతం మండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు రెస్ట్ ఇచ్చి.. వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విజయాలు సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణిదేవీలకు కీలక పదవులు దక్కడం మాత్రం ఖాయమంటున్నాయి టీఆర్ఎస్, తెలంగాణ భవన్, ప్రగతి భవన్ వర్గాలు.