గొర్రెను కాదు ఇంకో పులిని ఇవ్వండి..
posted on Mar 23, 2021 5:22PM
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 22 మంది గొర్రెలను గెలిపించారని.. ఆలా గెలిచినవాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం పోరాడడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఇవాళ అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వచ్చే తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలు కూడా ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. తిరుపతి ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలవాలని చూస్తోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండెక్కి కూర్చొన్న సీఎం జగన్ పొగరు దించాలంటే తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలవాలని ఆయన చెప్పారు. విజ్ఞులైన తిరుపతి ఓటర్లు న్యాయం, ధర్మం కోసం టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. రేపు ఉదయం నెల్లూరులో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ నామినేషన్ వేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని ఆయన కోరారు. అంతేకాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జగన్ సర్కార్ వైఫల్యాలపై ప్రజలకు వివరంగా చెబుతారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
మరోపక్క సంక్షేమ కార్యక్రమాల పేరిట వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి.. ప్రజల నుండి మాత్రం 100 రూపాయలను లాగేసుకుంటోందని అచ్చెన్న ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలను రాష్ట్ర సర్కార్ కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆయన మండిపడ్డారు. "టీడీపీ తరుఫున ఇప్పటికే మూడు పులులు ఉన్నాయి.. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో నిరంతరం ఈ మూడు పులులు గళం విప్పుతున్నాయి.. వీరికి అదనంగా మరో పులిని చేర్చండి" అని అచ్చెన్నాయుడు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.