ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్....500 కొబ్బరి చెట్లు దగ్ధం
posted on Jan 5, 2026 4:22PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో మంటలు ఇంక అదుపులోకి రాలేదు. సమీపంలోని కొబ్బరి తోటలను మంటలు అంటుకుని...500 కొబ్బరి చేట్లు కాలిపోయినట్లు అంచన వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. చుట్టుపక్కల 5 కి.మీల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు రాజమండ్రి నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంటలను త్వరితగతిన అదుపు చేసేందుకు ఓఎన్జీసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కోరారు. కాగా, ఉత్పత్తిని పెంచే పనుల్లో భాగంగానే ఈ లీకేజీ జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ వివరాలను తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు