పేకాటకు అనుమతి కోరుతూ హైకోర్టుకు.. కోర్టు తీర్పు ఏంటంటే?
posted on Jan 7, 2026 8:50AM
.webp)
జూదం ఆడతాం, ఆడిస్తాం అనుమతివ్వండంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పేకాట జూదం మూడు ముక్కలు- ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతుంటుంది. ఈ జూదానికి స్థానిక నేతల అండదండలు భారీగా ఉండటంతో పోలీసులు కూడా చూసీ చూడనట్టుగా వదిలేస్తుండటం కద్దు. కానీ ఇటీవలి కాలంలో పేకాట క్లబ్బులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే 13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అలా పిటిషన్ దాఖలు చేసిన వాటిలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హఓర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నరసాపురం యూత్ క్లబ్ వంటివి ఉన్నాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా డబ్బు పందెంగా పెట్టి పేకాట ఆడ్డం చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేస్తూ క్లబ్బుల పిటిషన్ లను తోసిపుచ్చింది. క్లబ్స్ తరఫు న్యాయవాది సుప్రీం తీర్పు ఆధారంగా.. రమ్మీ ఆడేందుకు అనుమతివ్వాల్సిందిగా తన వాదనలు వినిపించారు.
అయితే హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడ్డానికి వీల్లేదని.. అలా అడితే అది గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఇటీవల ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలిచ్చినట్టు స్పష్టం చేసింది
ఇప్పటికే నూజివీడు మ్యాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్ పై కూడా హైకోర్టు సరిగ్గా ఇలాంటి క్లారిటీయే ఇచ్చింది. రమ్మీని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులకు ఆడితే ఒప్పుకునేది లేదనీ.. అలా ఆడితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనీ జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు భీమవరం వ్యవహారంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం.