ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడుముక్కలాట!
posted on Apr 2, 2025 7:28AM

మంత్రుల పర్యటన వేళ అధికారులకు అష్టకష్టాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది. ముగ్గురు మంత్రుల పర్యటనల నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతను తలపిస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరావుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన ఇద్దరూ మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.
జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తంచేశారు. కార్యకర్తలు కూడా తమ నాయకులు మంత్రులు అయ్యారనే సంతోష పడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హైరానా పడుతున్నారు. ముగ్గురులో ఎవరు జిల్లా పర్యటనకు వచ్చినా కలెక్టర్ తోపాటు జిల్లా స్థాయి అధికారులంతా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే. ఒక్కోసారి ముగ్గురూ జిల్లాలో ఉంటే అధికారులు పరుగులు పెట్టాల్సిందే. ఎవరి కార్యమంలో పాల్గొనకపోతే ఎమవుతుందోనని హడలిపోతున్నారు. అంతే కాకుండా మంత్రులు వరుస పర్యటనలతో అధికారులకు వారి కార్యక్రమాలకు హాజరు కావడానికే సమయమంతా సరిపోతోంది. వారంలో ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చారంటే అధికారులు ఆఫీసులకు వెళ్లకుండానే పర్యటనలకు హాజరవుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉండటంతో పాటు కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు చూడాల్సి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా మంత్రులు పర్యటనలకు వచ్చారంటే తప్పనిసరిగా హాజరుకావాల్సిందే.
ఇక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతున్నది. ఈ పరిస్థితి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల అధికారులు ఎదుర్కొంటున్నారు.. మరో వైపు ఖమ్మం పట్టణంలో ఏ మంత్రి పర్యటించినా పోలీసు, అధికార యంత్రాంగం అంతా మంత్రి కాన్వాయ్ లోనే ఉంటున్నారు..
దీంతో పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాన్వాయ్ లో భారీగా వాహనాలు ఉండటం వల్ల కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలను నిలిపివేస్తున్నారు. కాన్వాయ్ లో మంత్రుల వాహనాలతో పాటు అనుచరగణం భారీగానే పాల్గొంటున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. తుమ్మల నాగేశ్వరావు మాత్రం సీతారామ ప్రాజెక్టు వెంటపడి సాగర్ కాలువలకు లింక్ చేశారు. భట్టి, పొంగులేటి గ్రామీణ రహదారులను బాగుచేసే పనిలో ఉన్నారు.