ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం

ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 14 కి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి కనిపించడం లేదు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. ప్రధాని మోడీ కూడా అఖిల పక్ష భేటీ లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయాలని ప్రధాని నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రమేయం లేకుండా ఒడిశా లో లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. తమ రాష్ట్రానికి రైళ్లు, విమాన సర్వీసులు నెలాఖరు వరకూ నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. మరి మిగతా రాష్ట్రాలు కూడా నవీన్ పట్నాయక్ బాటలో పయనిస్తాయో లేక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తాయో చూడాలి.