అనంతపురంలో విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

ఏపీలో కరోనా పై పోరు కాస్తా.. డాక్టర్లు వర్సెస్ ప్రభుత్వం పోరులాగా మారేలా ఉంది. మాస్కులు, పీపీఈ కిట్స్ విషయంలో విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది.

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వకుంటే వైద్యం చేయలేమంటూ జానియర్ డాక్టర్లు చెబుతుండగా.. ఐసోలేషన్ వార్డులో వైద్యం అందించే సిబ్బందికి మాత్రమే పీపీఈ కిట్స్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది వెనకంజ వేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.