సిసోడియా వ్యవహారశైలిపై అభ్యంతరాలు!

ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా వ్యవహారశైలి మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల తన కార్యాలయంలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు తదితరులతో జరిగిన సమావేశంలో సిసోడియా విచిత్రమైన వ్యవహారశైలిని ప్రదర్శించారు. మంత్రులందరి ముందు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. కాలు మీద కాలు వేసుకోవడం నేరం కాదు. అయినప్పటికీ ఎక్కడ ఎలా వుండాలి అనే పద్ధతి ఒకటి వుంటుంది. మంత్రులతో జరిగిన ఆ సమావేశంలో సిసోడియా ఆ పద్ధతిని పాటించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ ఫొటోలో సిసోడియా కూర్చున్న తీరు ఒక ఐఏఎస్ అధికారి మంత్రులతో మాట్లాడుతున్నట్టు కాకుండా ఒక మహారాజుగారు తన దర్శనం కోసం వచ్చిన వారితో ‘ఏంటీ సంగతులు?’ అన్నట్టుగా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమధ్య సిసోడియా గత ఐదేళ్ళ కాలంలో ఐఏఎస్‌ల వ్యవహారశైలి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఐఏఎస్‌ల మీద నమ్మకం సడలిపోతోందని అన్నారు. అంత ఆవేదన వ్యక్తం చేసిన సిసోడియా తన వ్యవహారశైలిని ఇలా ప్రదర్శించడం మాత్రం వింతగా వుంది.