ఎన్టీఆర్ కాయిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్!
posted on Aug 30, 2023 12:48PM
ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారు దైవసమానంగా భావించే హీరో, శక పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ అధిరోహించని ఎత్తులు లేవు. ఆయనను అభిమానించని తెలుగువాడు ఉండడు. అటువంటి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుంది.
కాగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్‍ను సోమవారం (ఆగస్ట్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.
సోమవారం విడుదలైన ఈ నాణేన్ని మంగళవారం నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ లో అమ్మకాలు చేపట్టగా తొలిరోజే విశేష స్పందన లభించింది. ఈ ఎన్టీఆర్ రూ.100 స్మారక కాయిన్ ధరను మూడు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి ఉంచారు. రూ.4,850 చెక్క డబ్బాతో, రూ.4,380 ఫ్రూప్ ఫోల్డర్ ప్యాక్, రూ.4,050 యూఎస్సీ ఫోల్డర్ ప్యాక్‌గా నిర్ణయించింది. హైదరాబాద్ రెండు మింట్ కేంద్రాలతో పాటు.. https://www.indiagovtmint.in/en/commemorative-coins/ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ధర ఎక్కువైనా రూ.4,850 చెక్క డబ్బాతో వచ్చే కాయిన్ కు డిమాండ్ అధికంగా ఉండడం విశేషం. మంగళవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాణేన్ని విక్రయానికి అందుబాటులో ఉంచగా.. నాణేన్ని సొంతం చేసుకొనేందుకు ఉదయం నుండే మింట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు క్యూ కట్టారు.
రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేలు విక్రయాలు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని విక్రయాలు జరిగిపోగా.. మరోవైపు ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్‌సైట్‌లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేనికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. మొత్తం 12 వేల నాణెల్ని ముద్రించగా.. మరో ఎనిమిది వేల నాణేలను ముద్రించనున్నారు. ఆఫ్ లైన్ లో 5 వేల నాణెలు తొలిరోజే అమ్ముడుపోగా.. ఆన్ లైన్ లో నిమిషాల వ్యవధిలోనే అవుటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. సాధారణంగా స్మారక నాణేలకు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ నాణేలకు విపరీతమైన డిమాండ్ ఉండటం ఆయన పట్ల తెలుగువారి అభిమానానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు.
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ప్రముఖుల జ్ఞాపకార్థం ఇలా ఎన్నో కాయిన్స్ విడుదల చేసినా ఏ స్మారక నాణేనికీ దక్కని విశేష స్పందన ఎన్టీఆర్ నాణానికి దక్కడం విశేషం. ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేలేవీ పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి ముందుగానే 12వేలు ముద్రించామని, అయితే అవి తొలిరోజే అమ్ముడవడం విశేషమని శ్రీనివాస్ చెప్పారు. దీనిని బట్టే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఎంతటిదో అర్ధమౌతుంది. మరో ఎనిమిది వేలు ముద్రించి అందిస్తామని శ్రీనివాస్ చెప్పారు. అయితే, తొలిరోజు ఎక్కడ ఈ నాణేలు దొరుకుతాయో.. ఎలా దక్కించుకోవాలో చాలా మంది అభిమానులకు అవగాహనా లేదు. అసలు చాలా మందికి ఇవి అందుబాటులోకి వచ్చాయని కూడా తెలియదు. అయినా ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. కాగా.. ఒకటీ రెండు రోజులు పోతే ఈ నాణేనికి ఇంకాడిమాండ్ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ముద్రించే 8 వేలు ఉన్న డిమాండ్ కు ఏ మాత్రం సరిపోవు అనడంలో సందేహం అక్కర్లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఛరిష్మా ఇసుమంతైనా తగ్గలేదు సరికదా మరింత పెరుగుతోంది అనడానికి ఈ నాణానికి ఉన్న డిమాండ్ ను బట్టే తెలిసిపోతున్నది.