ముందస్తుగానే మినీ జమిలి?.. మోడీ వ్యూహమిదేనా?

వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ముచ్చటగా మూడో సారి ప్రధాని పదవి చేపట్టాలన్న మోడీ ఆకాంక్ష నెరవేరుతుందా? గత నాలుగైదు నెలల వరకూ బీజేపీలో కనిపించిన గెలుపు ధీమా సన్నగిల్లిందా? అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గెలుపు తీరాలను చేరాలన్న లక్ష్యంతో కొత్త వ్యూహాలు రచిస్తోందా?   అసలు కర్నాటక ఎన్నికల ఫలితంతోనే బీజేపీ పర్ స్పెక్టివ్ మారిపోయిందా? . ఆ ఎన్నికల ఫలితం వెలువడడానికి ముందు వరకూ హ్యాట్రిక్ విజయంపై ఉన్న ధీమా బీజేపీలో ఇప్పుడు పూర్తిగా అడుగంటిందా? అంటూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణలను అలంబనగా ఆ పార్టీ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలను ఎత్తి చూపుతున్నారు. ఎవరో తరుముకు వస్తున్నారన్నట్లుగా వరుసగా ప్రజాకర్షక కార్యక్రమాలను ప్రకటించేస్తున్నారు. ఇంత కాలం ధరల మోత గురించి పన్నెత్తి మాట్లాడని మోడీ ఇప్పుడు వరుసగా సామాన్యుడికి ఊరట కలిగేలా ధరల తగ్గింపుపై పడ్డారు. ముందుగా మధ్యతరగతికి గుదిబండగా మారిన గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండ ధరను రెండు వందల రూపాయల వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆయన పెట్రో ధరలను తగ్గించనున్నారని చెబుతున్నారు. కేంద్రం హఠాత్తుగా  ఇలా తాయిలాలు  ప్రకటించడం వెనుక భారీ వ్యూహం ఉందంటున్నారు.  

ఆ వ్యూహమే ముందస్తు సార్వత్రిక ఎన్నికలు అంటున్నారు. ఎటూ ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి ఉన్నాయి. ఈ ఎన్నికలలో మొరుగైన ఫలితాలు సాధించి సార్వత్రిక ఎన్నికలకు బలంగా, ఘనంగా సమాయత్తం కావాలన్న ఆలోచనలో ఉన్నాయి. అదే సమయంలో విపక్షాల ఐక్యతా యత్నాలు కూడా సవ్య దిశలో సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. అందుకే ముందస్తు సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచిస్తున్నది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు సార్వత్రిక ఎన్నికలూ ఒకే సారి జరిపిస్తే.. మొత్తం ఎన్నికలను జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయనీ, తద్వారా జాతీయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలూ మరుగున పడతాయని మోడీ భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పనిలో పనిగా గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదిస్తున్న జమిలి ప్రయోగం కూడా కానిచ్చేసినట్లౌతుందన్నది మోడీ యోచనగా చెబుతున్నారు. అందుకే ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలను కూడా జరిపించేస్తే రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయన్నది మోడీ యోచనగా చెబుతున్నారు. పనిలో పనిగా తాము ఏం చెబితే అది చేయడానికి ఎవరెడీ బ్యాటరీలా సదా సిద్ధంగా ఉండే వైసీపీ, బీజేడీ ప్రభుత్వాలను ఒప్పించి ఆయా రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు కూడా కానిచ్చేస్తే వీటినే మినీ జమిలి ఎన్నికలని ఘనంగా చాటుకుని చేసి చూపించామన్న ఘనతను ఖాతాలో వేసుకోవచ్చన్నది మోడీ యోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అందుకే  కేంద్రంలోని బీజేపీ సర్కార్ విపక్షాలు గుక్క తిప్పుకునే అవకాశం ఈయకుండా వరుస పెట్టి తాయిలాలు ప్రకటిస్తూ వేగంగా ఎన్నికలకు సమాయత్తమైపోతున్నదంటున్నారు.  అంటే నిర్దిష్ట గడువుకంటే మూడు నుంచి నాలుగు నెలలు ముందుగానే సార్వత్రిక ఎన్నికలు జరిగేలా మోడీ సర్కార్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందంటున్నారు.  

లోక్‌సభను రద్దుచేసి డిసెంబర్‌లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ముందుస్తుకు వెళ్లేందుకు అవసరమైన సన్నాహకాలన్నీ కేంద్రంలోని మోడీ సర్కార్ చాపకింద నీరులా కానిచ్చేస్తోందని  అంటున్నారు.    ఏపీ, ఒడిషాల  అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందస్తుగానే జరిపించేయాలని భావిస్తోందంటున్నారు. విపక్షాల ఐక్యతా యత్నాలు ఫలించేందుకు వీలుగా అవి సమగ్రంగా చర్చిచుకునేందుకు, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చేందుకు సమయం లేకుండా ఎన్నికల యుద్ధానికి శంఖారావం పూరించేసి ప్రయోజనం పొందాలన్నది మోడీ సర్కార్ యోచనగా చెబుతున్నారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu