కోడికత్తి కేసులో కొత్త అనుమానాలు!?
posted on Aug 30, 2023 12:37PM
కోడికత్తి కేసు విచారణ సందర్భంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ ఎందుకు రావడం లేదు అనడానికి కారణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. విశాఖ విమానాశ్రయంలో గత ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో జనపల్లి శ్రీను అనే యువకుడు దాడి చేసిన కేసును జగన్ పట్టుబట్టి మరీ ఎన్ఐఏ చేపట్టేలా చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పరిధిలోకి ఈ కేసు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ, అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న ఒకే ఒక్క సాంకేతిక కారణం ఆధారంగా ఈ కేసు ఎన్ఐఏకు అప్పగించారు.
అంతే ఇక అప్పటి నుంచీ ఈ కేసు దర్యాప్తు, విచారణ కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడో జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన దాడి కేసులో సంఘటన జరిగిన వెంటనే అరెస్టయిన నిందితుడు జనపల్లి శ్రీను అప్పటి నుంచీ జైళ్లోనే మగ్గుతున్నారు. ఇక సుదీర్ఘంగా సాగుతున్న దర్యాప్తు, విచారణలో ఇప్పటికే ఈ దాడి వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ విస్పష్టంగా తేల్చేసింది. అయినా కూడా కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనుకు బెయిలు మంజూరు కాలేదు. నిబంధనల మేరకు ఈ కేసులో నిందితుడికి బెయిలు రావాలంటే.. బాధితుడిగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని అంటున్నారు. అయితే జగన్ మాత్రం ఈ కేసులో ఎన్ఐఏ విచారణ సరిగా లేదనీ, మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందంటూ కోర్టుకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ విశాఖకు మారింది. విచారణ కోసం మంగళవారం కోడికత్తి శీనును రాజమహేంద్రవరం జైలు నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు తీసుకువచ్చారు.
యధా ప్రకారం కేసు విచారణ వాయిదా పడింది. కోడి కత్తి శీనుకు బెయిలు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడిన శీను తరఫు న్యాయవాది జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలమైనా ఇవ్వాలి లేదా శ్రీనుకు బెయిలు మంజూరు చేయడానికి అభ్యంతరం లేదంటూ ఎన్ఓసీఅయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ విస్పష్టంగా చెప్పినా రాజకీయాల కోసమే కేసును వాయిదా మీద వాయిదాలు పడేలా జగన్ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ కోర్టుకు హాజరు కావడం లేదని ఆరోపించారు. ఈ కేసులో ఏదైనా ఉందంటే అది కేవలం రాజకీయం మాత్రమేననీ, అప్పట్లో విపక్ష నేతగా ఈ దాడిని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న జగన్ ఇప్పుడు ఐదేళ్ల తరువాత మళ్లీ ఎన్నికలలో ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారనీ నిందితుడు జనపల్లి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. వాస్తవంగా 2018 అక్టోబర్ 25న అంటే విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన సమయంలో కోడి కత్తి ని విమానాశ్రయంలోకి తీసుకువచ్చింది ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అని జనపల్లి శ్రీను తరఫు న్యాయవాది సలీం వీలేకరుల సమావేశంలో చెప్పారు. నేరాన్ని జనపల్లి శీనుపై నెట్టేశారని ఆరోపించారు.
ఇప్పుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలంటే నాటి విషయాలన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే రాకుండా తప్పించుకుంటున్నారని సలీం ఆరోపించారు. ఇలా ఉండగా జగన్ పై విశాఖ విమానాశ్రయంలో అసలు దాడే జరగలేదనీ, మజ్జి శ్రీనివాసరావు తీసుకువచ్చిన కోడి కత్తితో జగన్ తనను తాను గాయపరుచుకుని ఆ నేరాన్ని జనపల్లి శ్రీనుపై నెట్టేశారనీ, అందుకే కోడికత్తిపై శ్రీను వేలిముద్రలు ఉన్నాయా? అసలు ఎవరి వేలిముద్రలు ఉన్నాయి అన్న విషయాన్ని ఇప్పటి వరకూ ఇతమిథ్థంగా చెప్పడంలేదనీ న్యాయనిపుణులు అంటున్నారు. ఇక మంగళవారం విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన నిందితుడి తరఫు న్యాయవాది సలీం.. ఈ కేసులో రాజకీయమే కుట్ర కోణమనీ, వచ్చే ఎన్నికలలో లబ్ధి కోసమే జగన్ కోర్టుకు హాజరు కాకుండా కేసులో వాయిదాల పర్వం కొనసాగేలా చేస్తున్నారనీ ఆరోపించారు. ఏది ఏమైనా గత ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్న జనపల్లి శ్రీనుకు న్యాయం జరగాలంటే ఎన్ఐఏ కోర్టుకు రావాలి జగన్.. ఇవ్వాలి వాంగ్మూలం అన్నదే తమ డిమాండ్ అని సలీం చెప్పారు.