భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వంపై రచ్చ... భారత్ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ అర్హత
posted on Jun 13, 2016 4:30PM

ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) లో భారత్ కు సభ్యత్వం లభిస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్జీ కూటమిలో సభ్యత్వంపై చైనా తన నిరసనను తెలియజేసినట్టు వార్తలు వినిపించాయి. దాని వెంటే వియన్నా భేటీలో భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగలేదని.. భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగకుండా తానెలా అభ్యంతరం వ్యక్తం చేస్తానని చైనా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. వియన్నాలో జరిగిన భేటీలో భారత్ సహా ఏ ఒక్క దేశానికి కూటమిలో సభ్యత్వంపై చర్చ జరగలేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భేటీలో భారత్ సభ్యత్వంపై చర్చ జరిగిందంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఆ దేశం పేర్కొంది.
మరోవైపు దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం సాధించేందుకు భారత్ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ అర్హత ఉందని పాకిస్థాన్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. ఎన్‌పీటీ(నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం ఇవ్వడానికి గ్రూప్ అంగీకరించి.. ఒకేతరహా విధానాన్ని ఏర్పాటుచేస్తే అందులో చేరేందుకు భారత్ కన్నా పాకిస్థాన్‌కి ఎక్కువ అర్హతలున్నాయని ఆయన అన్నారు.