వైసీపీ న్యూ టార్గెట్ విజయసాయిరెడ్డి

వైసీపీకి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ పై ఈగ వాలితే.. ఆ ఈగే వైసీపీయుల టార్గెట్ అవుతుంది. అలాగే పార్టీ భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించి ఎవరైనా సలహాలూ, సూచనలూ ఇచ్చినా, అవి జగన్ కు ఏమాత్రం రుచించకపోయినా ఆ పార్టీకి తనమన  అన్నతేడా ఉండదు. సొంత తల్లి అయినా, సొంత చెల్లి అయినా సరే జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు.  సోంత మీడియా, సొంత సోషల్ మీడియా లో వారిపై విమర్శల దాడి జరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే  అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలతో దుమ్మెత్తి పోసేస్తుంది. గతంలో జగన్ తో విభేదించిన ఆయన సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై కూడా వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిలపై అయితే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కు కూడా వెనుకాడ లేదు. ఇప్పుడు వైసీపీ టార్గెట్ లిస్ట్ లోకి విజయసాయి కూడా చేరారు. 

ఔను విజయసాయిరెడ్డి టార్గెట్ గా వైసీపీ ఇప్పుడు నిప్పులు చెరుగుతోంది. ఎందుకంటే..  వైసీపీకి జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల నష్టం జరుగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదనీ, కర్త, కర్మ, క్రియా అన్నీ  వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమేని కుండబద్దలు కొట్టేశారు. అలాగే వైవీ సుబ్బారెడ్డి, వైవీ రావులు సన్నిహితులనీ  వెల్లడించారు. 

కాకినాడ పోర్టు వ్యవహారంలో బుధవారం (మార్చి 12) విజయసాయిరెడ్డి విజయవాడలో సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.  మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి… ఆపై రాజకీయాలనే వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతలను ఓ కోటరీగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను  వైసీపీ నేత సుధాకర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సీఐడీ విచారణ ఓ బూటకమనీ, ఆ పేరుతో విజయసాయి మీడియా ముందుకు వచ్చి డ్రామాలాడారనీ దుయ్యబట్టారు. వైవీసుబ్బారెడ్డి, కేవీరావుల మధ్య సంబధాలు లేవనీ, నిజంగా ఇరువురి మధ్యా సన్నిహిత సంబంధాలు ఉంటే కేవీరావు కేసు ఎందుకు వేస్తారనీ లాపాయింట్లు తీశారు.  ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను సాయిరెడ్డి చదివారని ఆరోపించారు. వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి.. పార్టీ అధినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని విమర్శలు గుప్పించారు. జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని  అద్దెకు ఇచ్చారన్నారు.  మొత్తం మీద ఇక విజయసాయిరెడ్డి టార్గెట్ గా వైసీపీ విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది.