రేవంత్ కు రాములమ్మ సవాల్ అవుతారా?
posted on Mar 13, 2025 9:35AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఎన్నెన్ని ఉహాగానాలు వినిపించినా, చివరకు ఏమి జరగ వలసింది వుందో అదే జరిగింది. ఆశించి భంగ పడిన వారు కొందరైతే, అనూహ్యంగా అదృష్టం వహించి అందలం ఎక్కిన వారు ఇంకొందరు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రల్లోనూ, అక్కడ ఐదు, ఇక్కడ ఐదు మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరిగితే, మొత్తం పదికి పది స్థానాలు ఎకగ్రీవ మయ్యాయి. ఏపీలో ఐదుకు ఐదు స్థానాలు అధికార తెలుగుదేశం కూటమి సొంతం చేసుకుంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక స్థానాన్ని నిలుపుకుంది. మిగిలిన నాలుగులో మూడు కాంగ్రెస్, ఒకటి సిపిఐ ఖాతాలో చేరాయి. అయితే అక్కడితో కథ ముగిసినట్లేనా అంటే లేదు.
మరో వంక ఏపీలో బీజేపీకి ఒక సీటు కేటాయించడం, ఆ సీటును, బీజేపీ అధిష్టానం, గతంలో వైసీపీతో అంట కాగిన, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కేటాయించడంతో సహజంగానే టీడీపీలో కొద్దిపాటి అసంతృప్తి వ్యకమైంది. బీజేపీ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు జబర్దస్త్ రాజకీయాలు చేస్తోందన్న ఆగ్రహం టీడీపీ నాయకులు , కార్యకర్తల్లో వ్యక్తమైంది. అయితే చంద్రబాబు నాయుడి ధర్మ బోధనతో కొంత వరకు సర్దుకుంది. అలాగే టికెట్ ఆశించి భంగపడిన పిఠాపురం వర్మ ఎపిసోడ్ కూడా టీ కప్పులో తుపానులా సమసి పోయింది. సో... ఏపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ ఎన్నికల క్రతువు ముగిసింది.అయితే కొసమెరుపుగా కొత్తగాగెలిచిన ఎమ్మెల్సీలలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది? అందులో నాగబాబు బ్రదర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పేరు ఉంటుందా? అన్న చిన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా వుందని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క తప్పింది. నిజానికి, ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి సిఫార్సు చేసిన వారిలో ఒక్క అద్దంకి దయాకర్ కు మాత్రమే టికెట్ దక్కింది. అది కూడా ఢిల్లీలో కొప్పుల రాజు చక్రం తిప్పితేనే అయ్యిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అలాగే ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన ఇతర నాయకుల విషయం ఎలా ఉన్నా టీడీపీ రోజుల నుంచి అన్ని విషయాల్లో తోడుగా నీడగా ఉన్నవేంనరేంద్ర రెడ్డికి కూడా టికెట్ దక్కక పోవడం ముఖ్యమంత్రిని ఏమో కానీ, ఆయన అనుచరులను ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన ప్రతి ఒక్కరికీ టికెట్ ఇచ్చే కల్చర్ కాంగ్రెస్ లో లేదని రేవంత్ రెడ్డి సన్నిహిత నాయకులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రిగా కేవీపీ రామచాద్ర రావు పేరును, రాజ్యసభ టికెట్ కోసం, నాలుగు సార్లు సిఫార్సు చేసినా రాలేదని గుర్తు చేస్తున్నారు.
సరే అభ్యర్దుల ఎంపిక, ఎన్నిక వ్యవహారం ముగిసి అధ్యాయమే అనుకున్నా.. తెలంగాణ కాంగ్రెస్ లో అంతా బాగుంది అనుకునే పరిస్థితి అయితే లేదని అంటున్నారు. ముఖ్యంగా, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొత్త లెక్కలు తెరపైకి వచ్చిన నేపధ్యంలో ముఖ్యమంత్రికి మంత్రివర్గ విస్తరణ కత్తి మీద సామే అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా లక్కీ కొటాలో ఎమ్మెల్సీ టికెట్ కొట్టేసిన, రాములమ్మ విజయ శాంతికి హోం మంత్రి పోస్ట్ ఖాయమని జరుగుతున్న ప్రచారం నిజం అయితే కొత్త చిక్కులు తప్పవని అంటున్నారు.అలాగే మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానా రెడ్డికి ఢిల్లీలో పలుకుబడి పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అంటే రాష్ట్రంలో ఆయన మరో పవర్ సెంటర్ అయ్యే ప్రమాదం లేక పోలేదని అంటున్నారు. మొత్తానికి ఎటు నుంచి ఎటు చూసినా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు ముందు మరిన్ని సవాళ్ళు తప్పక పోవచ్చనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్త మవుతోంది.