పంచాయతీ ఎన్నికల వేళ షాక్ ! టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై
posted on Jan 30, 2021 12:58PM
పంచాయతీ ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో టీడీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పడాల అరుణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆమె పంపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. దశాబ్దాలుగా విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు పడాల అరుణ. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి అరుణ రాజీనామా చేయడంతో .. విజయనగరం జిల్లాలో టీడీపీకి కష్టాలు పెరుగుతాయని చెబుతున్నారు.
గత ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన పడాల అరుణ టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం, జిల్లా పార్టీ పెద్దలు తనకు కనీసం ప్రాధాన్యత ఇవ్వడలం లేదని మాజీ మంత్రి కంటతడి పెట్టారు. గౌరవం లేని చోట ఉండటం కష్టమని అరుణ వాపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన పట్ల పార్టీ ఇలా వ్యవహరిస్తుందని ఊహించలేదన్నారు. ఇలాంటి పరిస్థితులే టీడీపీలో కొనసాగడంపై పునరాలోచనలో పడేసిందని చెప్పారు పడాల అరుణ.
టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పడాల అరుణ బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఆమెతో సంప్రదింపులు చేసినట్లు చెబుతున్నారు. సోము వీర్రాజు కూడా పడాలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ నేత గద్దె బాబూరావు ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో పడాల అరుణ కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు.