దివంగత నేత వైఎస్ ను మెచ్చుకుంటూ.. సీఎం జగన్ కు చురకలంటించిన ఎస్ఈసీ
posted on Jan 30, 2021 11:48AM
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా సీఎం సొంత జిల్లా అయిన కడప పర్యటనలో ఉన్న ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశానని, ఆయనలో లౌకిక దృక్పథం ఉండేదని చెప్పారు. తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానంటే దానికి దివంగత వైఎస్సే కారణమన్న నిమ్మగడ్డ.. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ అప్పట్లో అధికారులకు ఇచ్చారన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైఎస్‌కు ఎంతో గౌరవం ఉండేదని అయన ఈ సందర్భంగా అన్నారు. రాజ్యాంగం ప్రకారమే తాము ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. ఏకగ్రీవాల కోసం ఒత్తిడి చేసేవారిని ఇంటికే పరిమితం చేస్తామని అయన స్పష్టం చేసారు. బలవంతంగా ఏకగ్రీవాలు చేయడం సమర్థనీయం కాదని.. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయమన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు అయన తెలిపారు.
అంతేకాకుండా కొంతకాలంగా కొంతమంది వ్యవస్థలను గౌరవించకుండా మావాళ్లు, మీవాళ్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ తీరు సరికాదని అయన అన్నారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తానూ భయపడే ప్రసక్తేలేదని ఇప్పటికే స్పష్టం చేశానని అయన అన్నారు. అసలు మీడియాను మించిన నిఘా మరొకటి ఉండబోదని, సమాజ హితం కోసం చురుకైన బాధ్యతను మీడియా తీసుకోవడం నిజంగా అభినందనీయమని ఆయన చెప్పారు. సీఎం జగన్ సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఒక వైపు వైఎస్ ను పొగుడుతూ.. మరోవైపు సీఎం జగన్ తీరును పరోక్షంగా తప్పుపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క ఎస్ఈసీ కడపలో చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.