నవరత్నాలతో నయవంచన..
posted on Feb 12, 2021 9:30AM
ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందంటా.. ఇంకెవ్వరని మోసం చెయ్యను అని..
పులి పచ్చాత్తాపం ప్రకటించిందంటా.. తోటి జంతువులను సంహరించను అని
ఈ కథ వినికూడా గొర్రెలింకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి .. అని అన్నాడు ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్
ఏపీలో ప్రజల తీరు, పాలకుల తీరు కూడా ఇలాగే ఉందని చెప్పాలి.. ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తన మన బేధాలు లేకుండా పోతున్నాయి .. అధికారం కోసం సొంత పార్టీ వర్గాలపైనే దాడులకు దిగడమే కాకుండా.. నోటి దగ్గర కూడు కూడా లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నాయకుల మాటలు వినకపోతే నామినేషన్ వేయనివ్వడం లేదు.. ఒకవేళ రెబెల్ గా నామినేషన్ వేసిన వారి జీవితాలను కాలరాస్తామంటున్నారు వైసీపీ నాయకులు.. హోమ్ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గంలో సొంత పార్టీ వారికే రక్షణ లేకుండా పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల వైసీపీ రెబల్‌గా నామినేషన్ వేయడానికి వెళ్తున్న వారిపై దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్ వేసిన రెబల్ వర్గంపై ఇప్పుడు బెదిరింపుల పర్వం ప్రారంభమైంది. ఈ వర్గంలో ఎక్కువ శాతం పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు.
ఈ క్రమంలో గురువారం పొలాలకు వెళ్లే నీటి పైపులను పగల గొట్టడమే కాకుండా నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటేనే పంటకు నీరిచ్చేది అంటూ బెదిరించారు. పొలాల్లో ట్యూబులు, ఇంజన్లు పగలగొడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వచ్చేసరికి వారంతా పరారయ్యారు. బాధితులు గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ ప్రశాంతితో పాటు స్థానిక పోలీసుల వద్ద తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలు కూడా ఇవ్వమంటున్నారని, మా నోటి వద్ద కూడు లేకుండా చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.