కొవిడ్ టీకాపైనా రాజకీయం..దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కేంద్రం

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ "కోవాగ్జిన్" ను దేశ వ్యాప్తంగా ప్రజలకు ఇస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కోవాగ్జిన్ పై తమకు అనుమానాలు ఉన్నాయని, వేంటనే తమ రాష్ట్రానికి దీని సరఫరాను నిలిపివేయాలని చత్తీస్ గఢ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇంకా మూడో దశ ట్రయల్స్ పూర్తికాని ఈ వ్యాక్సిన్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదని, అంతేకాకుండా తమకు అందిన వ్యాక్సిన్ వయల్స్ పై ఎక్స్ పైరీ డేట్ కూడా లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి టీఎస్ సింగ్ దియో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాక్సిన్ పై ప్రజలలో కూడా అసంతృప్తి ఉందని అయన తెలిపారు.

ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్.. "అసలు మీ రాష్ట్రం వ్యాక్సిన్ లక్ష్యాన్ని అందుకోవడంలోను, షెడ్యూల్ ప్రకారం ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ను ఇవ్వడంలోను చాలా వెనుకబడివుంది. ఈ విషయాన్ని కేంద్రం గమనిస్తోంది. మీరు ముందు ఆ సంగతి చూడండి" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా బయటకు రాలేదన్న సంగతి తెలిసిందే. అయినా అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగానే వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు దీనిని ఇస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్న ఈ వ్యాక్సిన్ సురక్షితమని, మన శరీరంలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంపోందిస్తుందని.. ఈ సందర్భంగా మంత్రి హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. మరోపక్క వ్యాక్సిన్ వయల్ పై ఎక్స్ పైరీ డేట్ లేదన్న అనుమానం కూడా వట్టిదేనని దానిపై ఆ తేదీ కూడా ఉందని చెబుతూ, ఒక వ్యాక్సిన్ ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.


ఇది ఇలా ఉండగా చత్తీస్ గఢ్ రాష్ట్రంలో తొలి దశలో 69.8 శాతం మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 9.55 శాతం మందికి మాత్రమే మొదటి డోస్ ఇచ్చారని, ఇది అత్యంత అసంతృప్తికరమని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. వెంటనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ను ఇస్తే, కేంద్ర ప్రభత్వం కూడా సంతోషిస్తుందని స్పష్టం చేస్తూ హర్షవర్ధన్, చత్తీస్ గఢ్ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు.