నగరిలో రోజాకు మరో పరాభవం.. కనీసం ప్రొటోకాల్ కూడా దక్కని వైనం!

నగరి నియోజకవర్గంలో రోజా ప్రభ రోజు రోజుకూ తగ్గిపోతోంది. ఆమెకు నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ కూడా అమలు కావడం లేదు. ఈ విషయంలో రోజా తన అసంతృప్తిని పలు మార్లు వెల్లడించినా ఫలితం లేకపోయింది. పార్టీ హై కమాండ్ కూడా ఆమె ఆవేదనను పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటుంది.. సర్దుకు పోవాల్సిందే అని అన్యాపదేశంగానైనా పలు మార్లు రోజాకు అర్ధమయ్యేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరించింది. అయినా నియోజకవర్గంలో తన పట్టును నిరూపించుకుని ప్రత్యర్థుల చేత  శభాష్ అనిపించుకోకపోయినా.. మంత్రిగా తనకు దక్కాల్సిన గౌరవాన్ని వారి ద్వారా పొందాలన్న ప్రయత్నాలను రోజా విడవ లేదు. ఈ క్రమంలోనే తాజాగా రోజాకు మరో పరాభవం ఎదురైంది. వైసీపీ శ్రేణుల కథనం మేరకు ఆ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

నగరి నియోజకవర్గంలో రోజాకు ప్రధాన ప్రత్యర్థి అయిన  రెడ్డివారి చక్రపాణి రెడ్డికి  జగన్  శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన కూడా నగరి నియోజకవర్గంలో బలం పుంజుకుని మంత్రి రోజాకు దీటుగా నిలబడే అవకాశం వచ్చింది. ఇటీవల రోజా ప్రమేయం లేకుండా నగరి నియోజకవర్గంలో.. ఓ రైతు భరోసా కేంద్రానికి రెడ్డి వారి చక్రపాణి రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ రోజా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దాంతోటే రోజాకు నగరిలో సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదన్న సంగతి బహిర్గతమైంది.   రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన వ్యవహారం ఇంకా పూర్తిగా మరుగున పడకుండానే రోజాకు మరో పరాభవం ఎదురైంది. మంత్రి హోదాలో రోజా.. శ్రీశైలం అలయానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రికి ఆలయ చైర్మన్ స్వాగతం పలకాలి.  కానీ ఆలయం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి శ్రీశైలంలోనే ఉన్నప్పటికీ మంత్రి రోజాకుస్వాగతం చెప్పడానికి రాలేదు. ఆయన వస్తారేమోనని కొద్ది సేపు ఎదురు చూసిన రోజా  ఆయన రాకపోవడంతో చిన్న బుచ్చుకున్నారు.

చివరికి ఆలయ ఈవోనే లాంఛనంగా మంత్రి రోజాకు స్వాగతం పలికారు.  మంత్రి హోదాలో ఆలయ దర్శనానికి వెళ్లినా రెడ్డివారి చక్రపాణి రెడ్డి ప్రొటోకాల్ పాటించి స్వాగతం పలకకపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.