ఏపీలో వాడిపోతున్న కమలం.. బీజేపీ హైకమాండ్ ఏం చేస్తోంది?

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతానికి ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ ఒక్కో రాష్ట్రాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బ‌లోపేతం అవుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌తో ఆ పార్టీ నేత‌లు ముందుకెళ్తున్నారు. త‌మిళ‌నాడులోనూ బీజేపీ బ‌లోపేతానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా బీజేపీ ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై మాత్రం బీజేపీ పెద్ద‌లు దృష్టి సారించ‌డం లేదు. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ లు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. అయితే, ఎన్నిక‌ల త‌రువాత తెలుగుదేశం, జ‌న‌సేన  అధిష్టానాలు త‌మత‌మ‌ పార్టీల బ‌లోపేతం చేయడంపై దృష్టి సారించాయి. బీజేపీ నేత‌లు మాత్రం ఆ  దిశగా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రోవైపు బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. 

ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ లు రాష్ట్ర అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చ‌డంతోపాటు.. అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ ప‌డేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక ప‌క్క అమ‌రావ‌తి రాజ‌ధానిలో భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతోపాటు.. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం, మరమ్మతులు ఇలా అన్నిరకాలుగా అభివృద్ధిపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఇద‌లా ఉంటే చంద్ర‌బాబు, లోకేశ్ పార్టీ బ‌లోపేతంపైనా దృష్టిసారించారు. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి ప‌లువురిని త‌మత‌మ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే వైసీపీ సీనియ‌ర్ నేతలు టీడీపీ, జ‌న‌సేనలలో చేరారు. మ‌రికొంద‌రు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యంలో కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ మాత్రం వెనుక‌బ‌డిపోయింది. బీజేపీ  పెద్ద‌లు రాష్ట్రంలో పార్టీ ఉందన్న సోయ లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

 కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ నేత‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్నద‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించి స‌ముచిత న్యాయం చేసిన‌ప్ప‌టికీ.. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో.. ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం ఎంపిక విష‌యంలో బీజేపీకి ఇసుమంతైనా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో ఏపీ ప్ర‌భుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ను నియమించింది. 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. ఇందులో బీజేపీ నేత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. 20 కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌లో కేవ‌లం ఒక్క కార్పొరేష‌న్ (20 సూత్రాల అమ‌లు క‌మిటీ – లంకా దిన‌క‌ర్) ను మాత్ర‌మే బీజేపీకి కేటాయించారు. ఐదుగురు బీజేపీ నేత‌ల‌ను స‌భ్యులుగా నియ‌మించారు. దీనికితోడు ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం నియామ‌కంలోనూ బీజేపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఆపార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు ద‌క్కించింది. మ‌రొక బీజేపీ నేత‌కు టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తే బాగుండేద‌న్నభావన బీజేపీ రాష్ట్ర నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే, ఎన్టీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్  రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

బీజేపీ కేంద్ర పెద్ద‌లుసైతం ఏపీలో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. దీంతో పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోకి ప‌లువురు వైసీపీ నేత‌లు చేరారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం పెద్ద‌లు మాత్రం పార్టీలో చేరిక‌ల విష‌యంపై అస‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, త‌ద్వారా క్షేత్ర‌ స్థాయిలో పార్టీ క్యాడ‌ర్ లో నిస్తేజం నెల‌కొంటుంద‌ని  పార్టీ రాష్ట్ర నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ వారు పట్టించుకోలేదు. కేంద్ర పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని ప్ర‌భుత్వ నామినేటెడ్ ప‌దవుల్లో రాష్ట్ర‌ బీజేపీ నేత‌ల‌కు వీలైన‌న్ని ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కేలా చూడాల్సింది పోయి.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని సైతం ప‌ట్టించుకోక‌పోవ‌టంతో కొంద‌రు నేత‌లు ఏకంగా పార్టీ మారే ఆలోచ‌న సైతం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, త్వ‌ర‌లో మ‌రో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే వారం రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకొని.. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఏమేర‌కు ఎక్కువ నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కేలా చూస్తార‌నే విష‌యంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది.