రాములమ్మకు బెర్త్ లేనట్లేనా ?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. నలుగురు కొత్త  మంత్రుల ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు కొత్త మంత్రులతో నాలుగు బెర్తుల భర్తీకి నిర్ణయం జరిగింది. అయితే  ఈ నలుగురిలో రాములమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రాములమ్మకు మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజా ప్రోబబుల్స్ లో ఆమె పేరు లేదు. బహుశా  ఆర్ఏసీలో ఆమెకు బెర్త్ ఇస్తారో, లేక మిగిలిన రెండు ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ  ఇప్పటికైతే రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ లేనట్లే అంటున్నారు.  

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినా, ఎందుకనో అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. కానీ  ఇప్పడు అధిష్టానమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి,  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ లను ఢిల్లీకి పిలిపించి మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులతో మంత్రివర్గ విస్త్రరణతో పాటుగా  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఆరు గ్యారెంటీల అమలు ఇతరత్రా విషయాలను సుదీర్గంగా చర్చించిన మీదట మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతి ఇచ్చిందని  తెలుస్తోంది. 

అయితే  మొత్తం ఖళీలు ఒకేసారి కాకుండా.. ప్రస్తుతానికి ఓ నలుగురు కొత్త మంత్రులతో  ఉగాది ముహూర్తానికి ప్రమాణ స్వీకారం కానిచ్చి, మిగిలిన రెండు మంత్రి పదవులు,  మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీని మరో ముహూర్తానికి వాయిదా  వేసినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా,  డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్  ఖాళీలను కూడా భర్తీచేసేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్లు సమాచారం. 
మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్పడంతో పాటుగా, ప్రమాణ స్వీకారం చేసే నలుగురు కొత్త మంత్రుల పేర్లు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి రాజ గోపాల రెడ్డితో పాటుగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిచాలనే నిర్ణయం జరిగింది. ఇక నిర్ణయం కావలసింది,ముహూర్తం మాత్రమే అంటున్నారు. అది కూడా ఉగాదికి  ముందుగానే ఉంటుందని అంటున్నారు. 

అయితే  ఇక్కడితో అయిపోయినట్లు కాదని, ఇప్పటి జాబితాలో చివరి నిముషం వరకు ఎవరు ఉంటారో, కొత్తగా ఎవరు చేరతారో చెప్పలేమని,అందుకే ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో గప్ చిప్ గా వచ్చి చేరిన రాములమ్మ విజయశాంతిలాగా, మంత్రివర్గం జాబితాలో ఇంకెవరైనా ఫైర్ బ్రాండ్ దూసుకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అవును మళ్ళీ రాములమ్మే, బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చని అంటున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీతో పాటుగా హోం మంత్రి బెర్త్ కూడా రిజర్వు అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.  

అదలా ఉంటే, అడిగిన ప్రతి సారీ నో ..అంటూ మంత్రివర్గ విస్తరణను ఎప్పటికప్పడు  వాయిదా వేస్తూ వచ్చిన అధిష్టానం ఇప్పుడు పిలిచి మరీ మంత్రి వర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే  గోనె ప్రకాష్ రావు వంటి కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది కాంగ్రెస్ కల్చర్ లో భాగమని అంటున్నారు. గతంలో చెన్నా రెడ్డి హాయాంలోనూ ఇలాగే అధిష్టానం అనుమతి కోసం నెలలకు నెలలు నిరీక్షించిన మీదట, హఠాత్తుగా రాత్రి పిలుపు రావడమే కాకుండా మర్నాడే కొత్త మంత్రు ప్రమాణ స్వీకారం జరిగిందని గుర్తు చేస్తున్నారు. అంతే కదా  రాజు తలచు కోవాలే కానీ, విస్తరణ ఎంత పని.