గన్నవరంలో వార్ వన్ సైడేనా? వంశీ ఓటమి ఖాయమేనా?
posted on Aug 30, 2023 11:41AM
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ సీటు తెలుగుదేశం ఖాతాలో పడటం ఖాయమన్న చర్చ నియోజకవర్గంలో సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావ్.. తెలుగుదేశంలోకి జంప్ చేయడంతో , తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ విజయం దాదాపుగా ఖాయమైందనే ఓ టాక్ స్థానికంగా వైరల్ అవుతోంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేత దుట్టా రామచంద్రరావు తీరు ఎవరికీ అంతు బట్టని విధంగా ఉండడంతో.. ఆయన వ్యవహారశైలితో ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తల నొప్పులు మొదలైయ్యాయనే ఓ చర్చ హల్‌చల్ చేస్తోంది.
ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2019లో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన వల్లభనేని వంశీ.. జగన్ ముఖ్యమంత్రి కావడంతో.. ఆయన పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే గతంలో అంటే.. 2014 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై గెలుపొందారు. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. దుట్టా రామంచంద్రరావుతోపాటు ఆయన వర్గాన్ని.. ఎమ్మెల్యే వంశీ అండ్ కో ఓ రేంజ్‌లో ఆట ఆడుకొన్నారు.
నాడు వల్లభనేని వంశీ అరాచకాలపై అప్పుడే ప్రతిపక్ష నేత జగన్‌కి దుట్టాతోపాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత .. అతడి సంగతి చూద్దామంటూనే.. వంశీ విషయాన్ని పక్కన పెట్టేశారు జగన్. అంతలో 2019 ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మళ్లీ వంశీ విజయం సాధించడం ఆ వెంటనే జగన్ పార్టీలో చేరిపోవడం... చకచకా జరిగిపోయాయి.
కానీ దుట్టా రామచంద్రరావుకే కాదు.. యార్లగడ్డ వెంకట్రావ్‌కు సైతం జగన్ ప్రభుత్వం న్యాయం అయితే చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు ఫ్యాన్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న వారికెవరికీ న్యాయం జరగడం లేదని యార్లగడ్డ వెంకట్రావ్..తన అనుచరలతో జరిపిన ఆత్మీయ సమావేశంలో దుట్టా రామచంద్రరావు అంశాన్నే సోదాహరణగా వివరించారు. ఆ వెంటనే యార్లగడ్డ వెంకట్రావ్ సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారు.
దీంతో యార్లగడ్డ వెంకట్రావ్ అడుగులో అడుగు వేసి దుట్టాతోపాటు ఆయన వర్గం సైతం సైకిలెక్కేయడం ఖాయమని జగన్ భావించారు. ఆ క్రమంలో దుట్టాతోపాటు ఆయన ఫ్యామిలీతో సీఎం వైయస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో దుట్టా రామచంద్రరావు కొంత మెత్తబడ్డట్లే కనిపించినా.. ఆ తర్వాత ఆయన సైతం తన ప్రయత్నాలు తాను చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ అగ్రనాయకత్వం.. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని రంగంలోకి దింపింది. అందులో భాగంగా దుట్టాతో వల్లభనేని వంశీ మంతనాలు జరిపినా.. ఫలితం లేకుండా పోయింది.
గతంలో ఎమ్మెల్యే వంశీతోపాటు ఆయన వర్గం పెట్టిన ఇబ్బందుల కారణంగా.. రానున్న ఎన్నికల్లో ఆతడి విజయం కోసం పని చేయడం తమ వల్ల కాదని.. దుట్టా వర్గం ఇప్పటికే క్లియర్ కట్‌గా ఎంపీ వల్లభనేని బాలశౌరితో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇటువంటి పరిస్థితుల్లో దుట్టా వర్గం కూడా... రేపో మాపో తెలుగుదేశం గూటికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని..అదే జరిగితే గన్నవరంలో వార్ వన్ సైడేననీ.. తెలుగుదుశం విజయం గ్యారంటీ అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓ వేళ దుట్టాతోపాటు ఆయన వర్గం ఫ్యాన్ పార్టీలోనే ఉన్నా.. ఆ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ బరిలోకి దిగితే మాత్రం.. యార్లగడ్డ గెలుపునకే పని చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.