భార్యపై అనుమానంతో...

 

ఆ రాక్షసుడికి తన భార్య మీద అనుమానం. తన భార్యకి పుట్టిన చిన్నారి తన సంతానం కాదన్న సందేహం.. ఆ అనుమానం పెనుభూతమైంది. అంతే.. ఐదు నెలల వయసున్న ఆ చిన్నారిని హత్యచేశాడు. మెదక్ జిల్లా న్యాల్‌కల్  సమీపంలోని డప్పూర్ గ్రామానికి చెందిన స్రవంతికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన దశరథ్‌తో 2013 డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే పెళ్ళయినప్పటి నుంచి స్రవంతిని దశరథ్ అనుమానించేవాడు. ఐదు నెలల క్రితం స్రవంతి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. భార్యాపిల్లలను చూడటానికి వచ్చిన దశరథ్ కూతుర్ని ఆడిస్తూ ఆడిస్తూ భార్యని సిగరెట్ తెమ్మంటూ దుకాణానికి పంపించాడు. ఆమె తిరిగి వచ్చేలోపు  పసిపాప ముఖం మీద దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఊయలలో పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. ఊయలలో వున్న తన పాప చాలాసేపు కదలకుండా మెదలకుండా వుండేసరికి ఆ తల్లి పరీక్షించి చూసింది. బిడ్డ చనిపోయి వుండేసరికి భోరున ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు దశరథ్ పరారీలో వున్నాడు. పోలీసులు వెతుకుతున్నారు.