పాపం చెల్లెమ్మలు

శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి. సోదరీ సోదరుల బంధానికి, అనుబంధానికీ ప్రతికగా ఈ పండగ జరుపుకొంటారు. బుధవారం ( ఆగస్టు 30)న రాఖీ పౌర్ణమి సందర్భంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో అక్క చెళ్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చెల్లెమ్మ‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృతజ్ఞుడిని. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్ష‌ణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్న‌గా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నా... అంటూ ముక్తాయింపు ఇచ్చారు. అయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్ స్పందించిన తీరుపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.   ప్రతిపక్ష నేతగా  జగన్ పాదయాత్ర సమయంలో కూడా ఇలాగే చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. 

అయితే 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మీ సొంత చిన్నాన్న.. మాజీ మంత్రి  వివేకానంద రెడ్డి అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారనీ,  ఈ కేసులో అసలు సిసలు సూత్రదారులు ఎవరో తెలుసుకొని.. వారిని కఠినంగా శిక్షించి.. మీ సోదరి అంటే  వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు న్యాయం చేయాలని వారు సోషల్ మీడియా ద్వారా విజ్జప్తి చేస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి   సునీతకు మీరు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి ఇదే అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

అలాగే గతంలో మీరు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో దాదాపు 16 నెలల పాటు ఉన్నారని.. ఆ సమయంలో మీ సొంత సోదరి షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. మిమ్మల్ని అధికార పీఠం ఎక్కించారనీ... అంతగా కష్టపడిన ఆమెను.. మీరు సీఎం కూర్చి ఎక్కగానే మరిచిపోతే ఎలా అని వారు సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. మీ సోదరి షర్మిల.. మీ నుంచి ఏదో కోరుకుంటున్నదని.. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమెకు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే వెంటనే ఇచ్చేయండంటూ సీఎం జగన్‌కి నెటిజన్లు సూచిస్తున్నారు.       

ప్రస్తుత కాలంలో బంధాలన్నీ రాయిబండలాగా మారిపోయాయని.. ఓ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే.. ఎడమెఖం పెడ ముఖంగా ఉంటున్నారని.. అలాంటి వాళ్లకు అతీతంగా మీ సొంత సోదరి   షర్మిల.. నీ కోసం పాదయాత్ర చేశారనీ,.. అలాగే మీ చిన్నాన్న కుమార్తె సునీత సైతం.. మీరు ప్రతిపక్ష నేతగా నిరాహర దీక్ష చేస్తున్న సమయంలో మీ ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడారనీ.. అలాంటి సోదరీమణులకు తప్పక న్యాయం చేయాల్సి ఉందని నెటిజన్లు జగన్ కు హితవు పలుకుతున్నారు. 

అయితే రాఖీ పౌర్ణమి వేళ.. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అంతా క్యూ కడతారని.. వీరితో రాఖీ కట్టించుకోన్నట్లే.. మీ సొంత సోదరీమణులు   షర్మిల,  సునీతలకు న్యాయం చేస్తాను, మీకు అండగా... రక్షణగా నేను ఉంటానంటూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్విట్టర్ వేదికగా చెప్పినట్టే చెప్పి.. వారితో సైతం రాఖీ కట్టించుకోవాలని సీఎం  జగన్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు. అయినా సొంత చెల్లిని రోడ్డున పడేసిన మీరు అక్క చెళ్లెమ్మలకు రక్షణగా ఉంటానంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.  .

ఇక ఈ నాలుగేళ్ల కాలంలో.. రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారో, అదృశ్యమయ్యారో తెలిసిందేననీ,   వారికి, వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉందని సీఎం జగన్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu